దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో తొలి రోజే రికార్డుల మోత మోగింది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు బిహార్ ఆటగాళ్లు (వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ లోహారుకా, సకీబుల్ గనీ) విధ్వంసకర శతకాలు బాదారు. ఫలితంగా లిస్ట్-ఏ క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ (574/6)నమోదైంది.
ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
బిహార్ ఇన్నింగ్స్‌లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీది తొలి శతకం. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల 272 రోజులు) ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.
అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్ (35 బంతులు) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (29 బంతులు) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో ఏబీ డివిలియర్స్ (31 బంతులు) ఉన్నాడు.
ప్రపంచ రికార్డు బద్దలు
సెంచరీ తర్వాత కూడా జోరు కొనసాగించిన వైభవ్.. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా, ఏబీ డివిలియర్స్ (64 బంతులు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
150 పరుగుల తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన వైభవ్.. దురదృష్టవశాత్తు డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 190 పరుగులు చేసి ఔటయ్యాడు.
కొద్ది నిమిషాల్లోనే బద్దలైన రికార్డు
వైభవ్ విధ్వంసం కళ్ల ముందు మెదులుతూ ఉండగానే మరో భారీ రికార్డు నమోదైంది. ఇదే మ్యాచ్‌లో వైభవ్ కెప్టెన్ (బిహార్ కెప్టెన్) సకీబుల్ గనీ కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.
కొద్ది నిమిషాల ముందే వైభవ్ 36 బంతుల్లో శతక్కొట్టి, అన్మోల్‌ప్రీత్ సింగ్ (35 బంతులు) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. తాజా ప్రదర్శన తర్వాత అన్మోల్‌ప్రీత్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సకీబుల్ గనీ ఖాతాలోకి చేరింది. ఈమ్యాచ్‌లో సకీబుల్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స సాయంతో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు (టాప్-5)..
జేక్ ఫ్రేజర్- 29 బంతులు
ఏబీ డివిలియర్స్- 31
సకీబుల్ గనీ- 32
ఇషాన్ కిషన్- 33
అన్మోల్‌ప్రీత్ సింగ్- 35
ఆయుశ్ మెరుపు సెంచరీ
ఇదే మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన ఆటగాడు ఆయుశ్ లోమాకురా. ఆయుశ్ 56 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో బిహార్ చేసిన స్కోర్ (574) లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. దీనికి ముందు ఈ రికార్డు తమిళనాడు పేరిట ఉండేది. 2022 ఎడిషన్ విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టు ఇదే అరుణాచల్ ప్రదేశ్‌పై రెండు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు
👉బిహార్- అరుణాచల్ ప్రదేశ్ మీద 2025లో 574/6
👉తమిళనాడు- అరుణాచల్ ప్రదేశ్ మీద 2022లో 506/2
👉ఇంగ్లండ్- నెదర్లాండ్స్ మీద 2022లో 498/4
👉సర్రే- గ్లౌసెస్టర్‌షైర్ మీద 2007లో 496/4
👉ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మీద 2018లో 481/6.


