శ్రీలంక టూర్‌.. బౌద్ధ రామాయణం.. | Travel Tips: Sri Lanka Ramayana Tour Package in 6 Days | Sakshi
Sakshi News home page

శ్రీలంక టూర్‌.. బౌద్ధ రామాయణం..

Sep 29 2025 9:43 AM | Updated on Sep 29 2025 10:13 AM

Travel Tips: Sri Lanka Ramayana Tour Package in 6 Days

మహా సముద్రంలో నీటిబొట్టంత దేశం. అందులో రాముడు కట్టిన శివాలయం. రాజుకు ఆశ్రయమిచ్చిన దంబుల్లా గుహలు. కశ్యపుని రాజ్రప్రసాదం సిగిరియా కోట. క్యాండీ బుద్ధుని దంతావశిష్ట ఆలయం. అశోకవాటిక నువారా సీతా ఎలియాలు. మూడు నిలువులెత్తు ధీర హనుమాన్‌. రథమెక్కిన పంచముఖ ఆంజనేయుడు. సీతమ్మ అగ్నిపరీక్ష సాక్షి దివురుంపోలా. విభీషణుడి పట్టం కట్టిన కెలానియ తీరం. ఇవన్నీ శ్రీలంక రామాయణ యాత్రలో. 

1 వరోజు
హైదరాబాద్‌ నుంచి శ్రీలంకకు ప్రయాణం. ఉదయం పదిన్నరకు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌΄ోర్ట్‌కు చేరుకుని టూర్‌ ఆపరేటర్‌లకు రిపోర్ట్‌ చేయాలి. మధ్యాహ్నం 13.30 గంటలకు యుఎల్‌178 విమానం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 15.25 గంటలకు కొలంబోకు చేరుతుంది. ఫ్లయిట్‌ దిగిన తర్వాత చిలా లోని మునీశ్వర ఆలయ దర్శనం, ఆ తర్వాత మనవేరి ఆలయ దర్శనం చేసుకుని దంబుల్లాలో హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ కావడం. 

రాత్రి బస. రాముడు మొక్కిన శివుడు 
మునీశ్వర ఆలయం ఉన్న ప్రదేశం పేరు చిలా. రామాయణం కథనం ప్రకారం రావణ సంహారం తర్వాత రాముడు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో ఆగి శివుడిని ప్రార్థించాడు. రాముడికి దీవెనలిచ్చిన శివుడు నాలుగు శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్పాడని విశ్వాసం. ఆ మాట కోసం రాముడు నిర్మించిన ఆలయం 16వ శతాబ్దంలో పూర్తిగా ధ్వంసమైంది. 

అప్పుడు రాజు మొదటి రాజసింఘె పునర్నిర్మించాడు. దానిని 17వ శతాబ్దంలో ΄ోర్చుగీసు వాళ్లు ధ్వంసం చేశారు. ఇప్పుడు మనం చూసే అందమైన ఆలయాన్ని స్థానికులు నిర్మించుకున్నారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న మనవెరి ఆలయం కూడా స్వయంగా రాముడు నిర్మించినదేనని అందుకే దీని పేరు రామలింగం అని స్థలపురాణం.

2వ రోజు
దంబుల్లా నుంచి క్యాండీకి ప్రయాణం. హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత దంబుల్లా కేవ్‌ టెంపుల్, సిగిరియా ఫోర్ట్రెస్‌ వీక్షణం. మధ్యాహ్న భోజనం తర్వాత క్యాండీ ప్రవేశం. పెరడేనియాలోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌ సందర్శనం, సాయంత్రం క్యాండీ కల్చరల్‌ షో వీక్షణం, రాత్రి బస క్యాండీలో. 

రాజుకు ఆశ్రయమిచ్చిన గుహలు 
దంబుల్లా క్రీస్తుపూర్వం నుంచి నివాస ప్రదేశం. ఇందులోని భారీ కొండను బౌద్ధ భిక్షువులు తమకు నివాసం కోసం గుహలుగా తొలుచుకున్నారు. అనూరాధపురాను పాలించిన వత్తగామిని అభయ క్రీ.పూర్వంలో ఒకటవ శతాబ్దంలో 14 ఏళ్ల పాటు రాజ్య బహిష్కరణకు గురయిన సందర్భంలో అతడికి బౌద్ధ భిక్షువులు ఇక్కడే ఆశ్రయమిచ్చారు. తిరిగి అనూరాధపురకు వెళ్లి రాజ్య సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్న వత్తగామిని బౌద్ధభిక్షువుల పట్ల కృతజ్ఞతతో ఈ గుహలను మరింత చక్కగా మెరుగులు దిద్దించాడు. అద్భుతమైన ఈ గుహాలయాలను ఫొటో తీయడానికి అనుమతి ఉండదు. కాబట్టి మనోఫలకం మీద ముద్రించుకోవడమే. 

సిగిరియా దుర్గం 
సిగిరియా దుర్గం ప్రాచీనమైన రాతి కోట. దంబుల్లాకు సమీపాన ఉంది. ఈ నిర్మాణం యునెస్కో గుర్తించిన వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌. కోట ఒక కొండ మీద ఉంటుంది. ఆశ్చర్యమేమిటంటే రాజస్థాన్‌ కోటలు కూడా ఎక్కువ భాగం కొండల మీదనే ఉన్నాయి. కానీ ఈ సిగిరియా కోట ఉన్న కొండ నిటారుగా ఉంటుంది. మొక్కలను రకరకాల ఆకారాల్లో ప్రూనింగ్‌ చేసినట్లు ఈ కొండను కోట నిర్మాణానికి తగినట్లు చెక్కినట్లు ఉంటుంది.

శత్రుదుర్బేధ్యంగా నిర్మించడంలో ఇదొక పద్ధతి. శ్రీలంక రాజు కశ్యపుని కోసం నిర్మించిన రాజ్రప్రసాదం ఇది. శ్రీలంకలో బౌద్ధం విస్తరించిన నేపథ్యంలో కశ్యపుని తర్వాత ఈ రాజ్రప్రాసాదం బౌద్ధుల అధీనంలోకి వెళ్లింది. ప్రాచీన నగర నిర్మాణశైలికి నిదర్శనం ఈ రాజ్రప్రాసాదం. ఆర్కిటెక్చర్‌ స్టూడెంట్స్‌కు ఒక పాఠ్యగ్రంథం వంటిది. 

రాయల్‌ బొటానికల్‌ గార్డెన్‌ 
ఈ గార్డెన్‌ క్యాండీ నగరం నుంచి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాదాపుగా 150 ఎకరాల్లో విస్తరించిన ఈ గార్డెన్‌లో నాలుగు వేల రకాల మొక్కలున్నాయి. ఇక్కడ పర్యటిస్తుంటే మ్యాప్‌లో కనిపించే గోరంత దీవిలో చూడాల్సిన ప్రదేశాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. నీటిబుగ్గ వంటి దీవి కావడంతో ఏడాదంతా పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. 

శ్రీలంక సాంస్కృతిక కళల ప్రదర్శన చూడకుండా వెనుదిరిగితే ఆ దేశం ఆత్మను అర్థం చేసుకోవడంలో విఫలమైనట్లే. క్యాండీ నగరంలోని లేక్‌ క్లబ్‌లో రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి శ్రీలంక సంస్కృతి సంప్రదాయాలను, ఆ దేశ చరిత్రను వ్యక్తీకరిస్తూ నాట్యప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు జరుగుతుంటాయి. మన దక్షిణ భారత కళారూ΄ాలకు కొనసాగింపుగా ఉంటాయి. వాటిని మనసు పెట్టి వీక్షించాలి. 

3వరోజు
క్యాండీ నుంచి నువారా ఎలియాకు ప్రయాణం. ఉదయం త్వరగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకుని హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి బయలుదేరాలి. క్యాండీలోని బుద్ధుడి దంతావశిష్టం ఆలయ దర్శనం తర్వాత రంబోదాలో భక్త హనుమాన్‌ టెంపుల్‌ దర్శనం, టీ ఫ్యాక్టరీ విజిట్‌. అశోక వాటిక సందర్శనం తర్వాత నువారా ఎలియాలో హోటల్‌లో చెక్‌ ఇన్‌. రాత్రి బస. 

క్యాండీ బౌద్ధ విశిష్టం 
శ్రీలంకలోని హెరిటేజ్‌ సైట్‌లలో కాండీ నగరం ఒకటి. సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉందీ నగరం. 

క్యాండీలో బుద్ధుడి దంత ధాతువుని ప్రతిక్షేపించిన నిర్మించిన ఆలయం (టూత్‌ రిలిక్‌ టెంపుల్‌) ఉంది. ఇక్కడి నేషనల్‌ మ్యూజియం ప్రపంచదేశాల్లోని బౌద్ధం అంతటినీ ఒక చోట రాశిపోసినట్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రం అమరావతి బౌద్ధ స్థూపం నమూనాల నుంచి చైనాలోని లాఫింగ్‌ బుద్ధ ప్రతిమలతోపాటు భవిష్యత్తులో పుట్టబోయే బుద్ధుడి ఊహాశిల్పం కూడా ఉంది. రిలిక్‌ టెంపుల్‌ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యలెస్‌లున్నాయి. ఆలయం, రాజ్రప్రాసాదాలు ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. 

శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారి΄ోవడానికే ఇలాంటి ఏటవాలు కప్పు నిర్మాణాలు. ఈ నగరంలో పోర్చుగీసు, బ్రిటిష్‌ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు గుర్రాలు నడవడానికి అనువైన నేలతో కలోనియల్‌ ఫీల్‌ను కలిగిస్తుంటాయి. యూరప్‌ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్‌ హోటల్‌ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్‌ వాళ్లు హిల్‌ స్టేషన్‌లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. 

నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్‌ చాలా ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సు ఒడ్డున ఉన్న ధవళ బుద్ధుడిని మిస్‌ కాకూడదు. కాండీ నగరంలోని ఈ సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. 

రంబోదా హనుమాన్‌ 
శ్రీలంక అనగానే మన భారతీయులకు గుర్తొచ్చే పేర్లలో రాముడు, సీత, రావణాసురుడి తర్వాత హనుమంతుడిదే. ఇంత గొప్ప పౌరాణిక గ్రంథంలో హనుమంతుడే లేక΄ోతే రామాయణమే లేదన్నంతగా శ్రీలంకకు హనుమంతుడితో బంధం ముడివడి ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంక మొత్తాన్ని చుట్టేసిన హనుమంతుడు అలసి΄ోయినప్పుడు రంబోదా అనే ప్రదేశంలో విశ్రమించాడని విశ్వాసం. ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. 

ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం ఎత్తు 18 అడుగులు. శ్రీలంకలో ఉన్న హనుమంతుడి విగ్రహాల్లో పెద్ద విగ్రహం ఇదే. అన్నట్లు ఈ ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ ఉంది. దుస్తులు భుజాలు కప్పుతుండాలి, మోకాళ్ల కిందకు ఉండి తీరాలి. క్యాండీ నుంచి నువారా ఎలియా వెళ్లే దారి మొత్తం దాదాపుగా టీ తోటలే. దమ్‌రో టీ ఫ్యాక్టరీ, సిలోన్‌ టీ ఫ్యాక్టరీ వంటి అనేక ఫ్యాక్టరీలున్నాయి. టీ తోట నుంచి సేకరించిన ఆకు కప్పులో టీ గా మారే ప్రక్రియను చూడవచ్చు. రకరకాల ఫ్లేవర్‌ టీలను రుచి చూసి, నచ్చిన టీ పొడులు కొనుక్కోవచ్చు. 

సీతా ఎలియా 
నువారా ఎలియా నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సీతా ఎలియా. దీన్నే అశోకవాటిక అంటారు. సీతాదేవి వనవాసం చేసిన ప్రదేశం అని చెబుతారు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి ఇష్టపడక΄ోవడంతో ఆమె ప్రకృతి ప్రేమికురాలని గ్రహించి ఈ ఉద్యానవనంలో నివాసానికి ఏర్పాట్లు చేశాడని చెబుతారు. అశోకవాటిక మధ్యలో సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. 

సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి. ఆ శిల్పం నేపథ్యంలో ఫొటో తీసుకోవడం మర్చిపోవద్దు. సీతా అమ్మన్‌ ఆలయం దక్షిణాది ఆలయాల నిర్మాణశైలిలో ఉంటుంది. కానీ మనదేశంలో శిల్పాలతో పోలిస్తే ఈ శిల్పాలలో మానవ శరీర నిర్మాణం మరికొంత దృఢంగా కనిపిస్తుంది.  

4వరోజు 
నువారా ఎలియా నుంచి కతరగామకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత నువారా ఎలియా సైట్‌ సీయింగ్‌. దివురుం΄ోలా ఆలయం, గాయత్రిపీఠం, గ్రెగరీ లేక్‌ విహారం తర్వాత కతరగామ టెంపుల్‌ దర్శనం, కతరగామలో హోటల్‌ గది చెక్‌ ఇన్, రాత్రి బస. 

బ్రిటిష్‌ జ్ఞాపకాలు 
శ్రీలంకలో ఎత్తైన ప్రదేశం నువారా ఎలియా. ఆరువేల అడుగుల ఎత్తులో ఉంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌లో ఉంటాయి. వేసవిలో కూడా ఏసీ సిక్స్‌టీన్‌లో పెట్టి స్వింగ్‌ పెట్టినట్లు గాలి తెమ్మెరలు ఒంటిని తాకుతూ ఉంటాయి. ఇక్కడ ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కన పెట్టిన లోకల్‌ వెజిటబుల్, ఫ్రూట్‌ మార్కెట్‌ కనిపిస్తే కళ్లప్పగించి చూడండి. ఎందుకంటే ఇక్కడి క్యాబేజీ మూడు నుంచి నాలుగు కేజీలు తూగుతుంది. 

కూరగాయలు, పండ్లు అన్నీ కంటికి ఇంపుగా కనిపిస్తాయి. ప్రతి ఇంటి ముందు కూరగాయల తోట ఉంటుంది. సుమారు ఐదు వందల గజాల స్థలంలో మూడు వందల గజాలు కూరగాయల కోసం వదిలి మిగిలిన ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటారు. బ్రిటిష్‌ పాలన ప్రభావం ఇక్కడి క్వీన్స్‌ కాటేజ్‌ వంటి కొన్ని నిర్మాణాల్లో కనిపిస్తుంది. 

అగ్ని ప్రవేశం ఇక్కడే 
దివురుంపోలా అంటే ఒట్టు పెట్టిన ప్రదేశం అని అర్థం. ఇది సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం అని చెబుతారు. ఇక్కడ కట్టిన ఆలయ ప్రాంగణంలో ఒక రాతి నిర్మాణం ఉంది. అరుగు మీద బౌద్ధ స్థూపం, అరుగుకు ముందు బుద్ధుడి చిన్న విగ్రహం ఉన్నాయి. ఆలయంలో రాముడు, సీత, హనుమంతుడి పాలరాతి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. 

మొత్తానికి ఇది రాయామణం, బౌద్ధం సమ్మేళనంగా కనిపిస్తుంది. ఇక గాయత్రి టెంపుల్‌ పరిశుభ్రంగా, ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుంది. గ్రెగరీ లేక్‌లో పడవ విహారం జీవితకాలపు మధురానుభూతిగా మిగులుతుంది. ఇక కతరగామ టెంపుల్‌కి వస్తే... ఇది కుమారస్వామి –వల్లీ దేవిని కలిసిన ప్రదేశమని చెబుతారు. శ్రీలంలోని తమిళులు, సింహళీయుల ఐక్యత జీవించిన రోజులకు ప్రతిబింబం ఈ ఆలయం. అలాగే వర్తక వాణిజ్యాలకు, రాజ్య విస్తరణకు శ్రీలంకలో అడుగుపెట్టిన అనేక మతాలు కూడా ఈ ఆలయాన్ని తమదిగానే స్వీకరించాయి. దాంతో అనేక మతాల చిహ్నాల సమ్మేళనంగా మారింది. 

5వరోజు 
కతరగామ నుంచి కొలంబోకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తరవాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి కొలంబోకు ప్రయాణం. కెలానియా బుద్ధ టెంపుల్, పంచముగ ఆంజనేయ టెంపుల్, కొలంబో సిటీ టూర్, హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, రాత్రి బస కొలంబోలో. 

విభీషణుడి పట్టాభిషేకం ఇక్కడే! 
కేలనియా మహా విహారాయ కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ‘కేలని గంగా నది’ తీరాన ఉంది. ఈ ఆలయం ప్రాచీన శిల్పకళ, అద్భుతమైన చిత్రకళా నైపున్యానికి ప్రతీక. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఈ చిత్రాల్లో విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. 

ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్‌ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. ప్రస్తుతం ఇది బౌద్ధ క్షేత్రం. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్‌ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ చిత్రాల్లో కనిపిస్తాయి. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం ప్రధాన ఆకర్షణ. 

ఆంజనేయునికి రథం 
శ్రీలంకలో రాముడు, సీతతోపాటుగా ఆంజనేయ స్వామికి గౌరవం ఉంటుంది. ఆంజనేయుడికి ఆలయాలు కూడా ఉన్నాయి. కానీ పంచముఖ ఆంజనేయుని విగ్రహం ఇదొక్కటే. ఆంజనేయుడి కోసం ప్రత్యేకంగా రథం ఉండడం ఇక్కడి మరో విశేషం. ఇక కొలంబో సిటీని ఒక రౌండ్‌ చుట్టేస్తే యూకే, యూఎస్, చైనా, ఇండియాలో ముంబయి, చెన్నై నగరాలు ఒకదాని తర్వాత మరొకటి రీల్‌ కళ్ల ముందు తిరిగినట్లు ఉంటుంది. 

శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఆనవాళ్లు కొలంబో నగరంలో ఎక్కడా కనిపించవు. ఇది చాలా సంపన్న నగరం. హిందూమహాసముద్ర తీరం గాలే బీచ్‌ పెద్ద టూరిస్ట్‌ అట్రాక్షన్‌. ఇక్కడ ఎకరాల్లో విస్తరించిన గ్రీనరీ అందంగా ఉంటుంది. రొయ్యల వడలు ఇక్కడ రుచి చూడాల్సిన వంటకం. ఇక్కడ గాలే ఫేస్‌ హోటల్‌ బ్రిటిష్‌ పాలన కాలం నాటిది. సాయంత్రాలు ఓపెన్‌ రెస్టారెంట్‌లో కూర్చుని సముద్రపు అలలను చూస్తూ గడపడం గొప్ప అనుభూతి. పౌర్ణమి రాత్రి ఇక్కడి సీ వ్యూ టేబుల్‌కి డిమాండ్‌ ఎక్కువ. 

6వరోజు
శ్రీలంక నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తరవాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి ఎయిర్‌΄ోర్టుకు ప్రయాణం. 29వ తేదీ ఉదయం 07.25 గంటలకు యుఎల్‌ 177 విమానం కొలంబోలో బయలుదేరి 09.20 గంటలకు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరడంతో టూర్‌ పూర్తవుతుంది. 

శ్రీలంక... పచ్చల పాపిడి బొట్టు! 
శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో నీటిబొట్టును పోలి ఉన్న చిన్న భూభాగం. వధువు నుదుటన మెరిసే పచ్చల పాపిడి బొట్టులా ఉంటుంది. ఈ దీవిలో ఎత్తైన పర్వతశిఖరాలు, అగాధాలను తలపించే సరస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడి రోడ్ల నిర్మాణం బాగుంటుంది. వాహనాల డ్రైవర్‌లు చక్కటి క్రమశిక్షణ పాటిస్తారు. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు వాహనం వేగం ఒక్కసారిగా ఇరవై కిలోమీటర్లకు తగ్గిపోయిందంటే అది స్కూల్‌ జోన్‌ అన్నమాటే. స్కూలు మొదలయ్యే సమయం, వదిలే సమయం కాక΄ోయినప్పటికీ ఈ నియమాన్ని పాటించి తీరుతారు. 

శ్రీలంకలో గొప్ప హిందూ ఆలయాలు, చర్చ్‌లు, మసీదులు, బౌద్ధ స్థూపాలు దేనికది గొప్ప శోభతో వెలుగొందుతూ ఉంటాయి. సముద్రంలో ఓ చిన్న దీవిలో ప్రతి అంగుళమూ పచ్చదనమే, ఏడాదంతా సస్యశ్యామలమే. కొబ్బరి తోటలు, పోక చెట్లు, మామిడి చెట్లు ఎక్కువ. అన్నట్లు ఇక్కడ మామిడి ఏడాదికి రెండు కాపులు కాస్తుంది. దేశం పరిశుభ్రంగా ఉంటుంది. మనుషులు సౌమ్యంగా ఉంటారు. చాలా దుకాణాల్లో మన భారతీయ రూపాయలు తీసుకుంటారు. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే. అయితే మూడు రూపాయిలు మన ఒక రూపాయికి దాదాపుగా సమానం. 

ఆ రోజు ఎక్సేంజ్‌ని బట్టి తీసుకుంటారు. మిగులు నాలుగైదు రూపాయలు వదిలేసినా కూడా చాలా సంతోషిస్తారు. శ్రీలంక ఆహార సంక్షోభం హోటళ్లలో కనిపిస్తుంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో కూడా వెరైటీల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఆహారాన్ని వృథా చేయవద్దని సూచన బోర్డు ఉంటుంది. ఆహారం మన దక్షిణాది రుచిని కలిగి ఉంటాయి. కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది. 

రామాయణ లంక 
శ్రీలంక రామాయణ యాత్ర ఎక్స్‌ హైదరాబాద్‌ టూర్‌. ఇది ఆరు రోజుల యాత్ర. అక్టోబర్‌ 24వ తేదీ మొదలవుతుంది. ప్యాకేజ్‌ కోడ్‌ ‘ఎస్‌హెచ్‌ఓ10’. ఇందులో కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువారా ఎలియా, కతరగామ ప్రదేశాలు కవర్‌ అవుతాయి. 

ప్యాకేజ్‌ వివరాలివి 
సింగిల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపు 90 వేల రూపాయలు (ఇండియన్‌ రూపీస్‌). డబుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపుగా 65 వేలు, ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 64 వేల వరకు ఉంటుంది. ఇవేవీ వర్తించవు! ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి రవాణా ఖర్చులు. లాండ్రీ ఖర్చులు, మద్యం, మెనూలో లేని ఇతర ఆహారాల ఖర్జులు, డ్రైవర్‌లకు – గైడ్‌లకు టిప్‌లు. 

డాక్యుమెంట్స్‌ ఏమేమి తీసుకెళ్లాలి! 
పాస్‌పోర్ట్‌ (ప్రయాణం చేసే నాటికి కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉండాలి) పాన్‌ కార్డు కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో సాఫ్ట్‌కాపీ 

ఎవరిని సంప్రదించాలి? 
ఐఆర్‌సీటీసీ జోనల్‌ ఆఫీస్, 9–1–129 /1 /302, ఆక్స్‌ఫర్డ్‌ ΄్లాజా, ఎస్‌డీ రోడ్, సికింద్రాబాద్‌. ఫోన్‌ నంబర్‌ : 040– 27702407

వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement