శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్‌లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు.
కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు.
ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే బాధిస్తుంది.
అక్షు న్యూజిలాండ్‌లో జరిగిన 2010 అండర్-19 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది.


