నమీబియా, జింబాబ్వే వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగబోయే 2026 అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా విమత్ దిన్సరా ఎంపిక కాగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కవిజ గమగే నియమితుడయ్యాడు.
ప్రపంచకప్‌లో శ్రీలంక.. జపాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. ఈ మెగా టోర్నీ కోసం లంక జట్టు ఇవాళే నమీబియాకు బయల్దేరనుంది. ముందుగా వెళితే అక్కడి పరిస్థితులకు అలవాటు పడవచ్చని లంక బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం జనవరి 17న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో తలపడుతుంది. అనంతరం జనవరి 19న ఐర్లాండ్‌తో, 23న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.
గతేడాది బంగ్లాదేశ్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌ల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆసియా కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన లంక యువ జట్టు.. మొదటి వరల్డ్‌కప్ టైటిల్ కోసం బలంగా పోరాడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
జట్టు వివరాలు
- విమత్ దిన్సరా (కెప్టెన్)
- కవిజ గమగే (వైస్ కెప్టెన్)
- దిమంత మహవితాన
- విరాన్ చముదిత
- దుల్నిత్ సిగేరా
- చమిక హీంటిగల
- ఆడమ్ హిల్మీ
- చమరిందు నెత్సరా
- సేత్మిక సెనేవిరత్నె
- కుగథాస్ మాథులన్
- రసిత్ నిమ్సరా
- విగ్నేశ్వరన్ ఆకాష్
- జీవంత శ్రీరామ్
- సెనుజ వెకునగొడ
- మలింత సిల్వా


