మొదటి అడుగు మార్పుకే | Stand4SHE led by Archana KR working to improve sanitation and hygiene in schools | Sakshi
Sakshi News home page

మొదటి అడుగు మార్పుకే

Jan 2 2026 5:35 AM | Updated on Jan 2 2026 5:35 AM

Stand4SHE led by Archana KR working to improve sanitation and hygiene in schools

ఛేంజ్‌ మేకర్‌

 

బాలికలు, మహిళల కోసం ‘స్టాండ్‌ఫర్‌షీ’ సంస్థను చిన్న వయసులోనే స్థాపించిన అర్చన కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసి బాలికల మరుగుదొడ్లు, మంచినీటి కోసం 100 కోట్లు విడుదల చేయించింది. 2025లో గిరిజనుల విద్య, సంస్కృతి కోసం విశేషంగా పని చేసింది. ‘మార్పు రావాలి. మార్పు మొదలవ్వాలి’ అనే అర్చన... దారి చూపాలే గానీ యువత, స్త్రీలు మార్పు కోసం గొప్ప ఉద్యమాలు నిర్మించగలరని అంటోంది.

‘ప్రభుత్వాలు సర్కారు బడులలో పారిశుద్ధ్యానికి నిధులు విడుదల చేస్తాయి. అవి ఎలా ఖర్చవుతున్నాయో ఎవరు చెక్‌ చేస్తారు? ప్రజలో, తల్లిదండ్రులో పూనుకుని చెక్‌ చేస్తే ఒక భయం ఉంటుంది. లేకుంటే ప్రభుత్వ బడులలో టాయిలెట్ల పరిస్థితి ఎప్పటికీ మారదు’ అంటుంది అర్చన కెఆర్‌.

2020 నుంచి కర్నాటక ప్రభుత్వ బడుల్లో ఆడపిల్లల కోసం రావలసిన మార్పుకై  పోరాడుతున్న అర్చన చాలా సాధించిందిగానీ బదులుగా సవాళ్లు ఎదుర్కొంది. ‘నేను ఎంతసేపటికీ టాయిలెట్ల కోసం పని చేస్తున్నానని పెళ్లి సంబంధాలు వెనకడుగు వేశాయి’ అంటుందీ 35 ఏళ్ల సామాజిక కార్యకర్త. 

అయినా ఆమె  పోరాటం ఏమీ ఆపలేదు. అసలు  పోరాటం చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆమె మాటల వల్ల తెలుస్తూనే ఉంటుంది. ‘పిల్లలంటే ఎందుకు మనందరికీ చిన్నచూపు. ప్రభుత్వ బడులలో, హాస్టళ్లలో వాళ్లు కనీస సౌకర్యాలు లేకుండా ఉంటే మనకు ఎలా మనసొప్పుతుంది’ అడుగుతోంది అర్చన. నిజమే. ఎంతో సంపద ఉన్న రాష్ట్రాలలో కూడా చలికాలం చన్నీటి స్నానాలు చేసే పిల్లలు ఎందరో ఉన్నారు ప్రభుత్వ హాస్టళ్లలో. ‘వెచ్చని దుప్పటి... వేడినీళ్లు ఈ పిల్లల హక్కు’ అని నినదించే వారు అర్చనలా ఎంతమంది. 

‘జీవితంలో ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది’ అంటుంది అర్చన.

→ చెట్టే చాటుగా...
అర్చనది కర్నాటక హసన్‌ జిల్లాలోని సకలేష్‌పూర్‌. ఈ ప్రాంతం పశ్చిమ కనుమల్లోకి వస్తుంది. ఇక్కడంతా గిరిజన జీవితం. మరుగుదొడ్లు అనేవే వారికి తెలియవు. తెలియనివ్వలేదు. ‘మరుగుదొడ్డి ఎలా ఉంటుందో నేను నా పద్నాలుగో ఏట చూశాను. మా నాన్న సకలేష్‌పూర్‌ వెటర్నరీ ఆస్పత్రిలో అసిస్టెంట్‌గా చేసేవాడు. ఆయనతోపాటు వెళ్లినప్పుడు అక్కడ టాయిలెట్‌ మొదటిసారి చూశాను’ అంటుంది అర్చన. 

చెప్పుల్లేని నడక, కొబ్బరి చిప్పలో టీ పోసి ఇస్తే తాగక తప్పని వివక్ష... ఇవన్నీ చూసిన అర్చన సోషల్‌వర్క్‌లో  పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేయాలని నిశ్చయించుకుంది. బెంగళూరులో ఆ చదువు ముగించాక ఒక ఎన్‌జీఓ స్టడీ కోసం ప్రభుత్వ బడులను చూస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు ఒక్క టాయిలెట్‌ కూడా లేకుండా అవస్థలు పడటం ఆమెకు తెలిసి వచ్చింది. ‘వారిలో నన్ను నేను చూసుకున్నాను. వారంతా నీళ్లు తాగడమే మానేశారు’ అని చెప్పిందామె. కొంతకాలం ఈ స్టడీ చేసి ఇక యాక్టివిస్ట్‌గా మారక తప్పదని రంగంలోకి దిగింది అర్చన.

→ స్టాండ్‌ ఫర్‌ షీ
అర్చన స్టాండ్‌ఫర్‌షీ అనే ఎన్‌జీఓను స్థాపించి 2000 సంవత్సరం నుంచి హసన్‌ జిల్లాలో ప్రభుత్వ బడులలో టాయిలెట్లు ఎలా ఉన్నాయో ప్రచారంలో పెట్టింది. ఒక్కో టాయిలెట్‌ పరిస్థితి సోషల్‌ మీడియాలో చూసి జనం కూడా ఆశ్చర్య పోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వం బెంబేలెత్తింది. చివరకు 2021లో అర్చన ఒత్తిడి వల్ల ఏకంగా 100 కోట్లు కేవలం టాయిలెట్ల పునరుద్ధరణకు ప్రభుత్వం విడుదల చేసింది. ఇది అర్చన విజయం.

→ శానిటరీ వేస్ట్‌
గ్రామీణ, గిరిజన బాలికలకు శానిటరీ నాప్‌కిన్స్‌ ఎలా వాడాలి, వాడవలసిన అవసరం ఏమిటి, వాడాక వాటిని ఎలా డిస్పోజ్‌ చేయాలి... ఇవన్నీ ఏమీ తెలియక పోవడం వల్ల స్వీయ శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత ఉండటం లేదు. ‘దీని గురించి ప్రచారం చేయడానికి శానిటరీ స్క్వాడ్స్‌ను తయారు చేశాము. వీళ్లు బడులకు తిరిగి బాలికలకు అవగాహన కలిగిస్తారు’ అని చెప్పింది అర్చన. 2025లో వేల మంది బాలికలకు తగిన చైతన్యం అర్చన స్క్వాడ్స్‌ వల్ల దొరికింది.

→ ఉద్యమిస్తేనే మార్పు
‘మన దేశంలో స్త్రీలు, యువత గొప్ప ప్రతిఘటన శక్తి కలిగినవారు. వారిని సరిగ్గా ఆర్గనైజ్‌ చేస్తే ప్రజా సమస్యల మీద గొప్ప ఉద్యమాలు లేవనెత్తగలరు. కోర్టుల్లో పిటిషన్‌ వేసినా గొప్ప మార్పు రాగలదని చాలామందికి తెలియదు. పదిమంది సంతకాలకు కూడా విలువ ఉంటుంది. సామాజిక కార్యకర్తలుగా ప్రజలకు మనం దిశను ఇవ్వాలి. ప్రజల కోసం పని చేయాలి. మనలో మార్పు వస్తేనే వారిలో మార్పు తేగలం’ అంటుంది అర్చన. ఏ సమస్య మీదైతే  పోరాడాలో ముందు దాని డేటాను తెలుసుకుని, దాని ఆధారంగా పరిశోధన జరిపి, సమస్యను ప్రజలకు వివరిస్తే ఉద్యమం అదే మొదలవుతుందని అంటుందామె.         

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement