ఏనుగు ప్రశాంతంగా ఉన్నంత సేపే.. వాటికి గానీ కోపం వచ్చిందంటే మనల్ని ఫుట్ బాల్ ఆడేస్తాయి... అంటూ మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇప్పుడు కోపం రాకుండానే ఏనుగులు ఫుట్‌బాల్ ఆడేశాయి. అయితే అది మనుషులతో కాదు... మనుషులు ఆడే నిజమైన ఫుట్‌బాల్ కావడం విశేషం. పర్యాటక రంగానికి ఊపు తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం తనదైన ప్రత్యేక ఫెస్టివల్స్‌ను నిర్వహించడం పరిపాటి. ఆయా ఫెస్టివల్స్ పాప్యులర్ అయితే దశాబ్ధాల పాటు అవి సదరు దేశాలకు టూరిస్ట్‌లను రప్పించగలగుతాయి.
ప్రస్తుతం మన పొరుగు దేశమైన నేపాల్ కూడా అదే పనిచేస్తోంది. తమదైన ఒక ప్రత్యేక ఫెస్టివల్‌ను పునరుద్ధరించింది. హిమాలయ దేశమైన నేపాల్‌లోని సౌరహా పర్యాటక పట్టణంలో గత శుక్రవారం జరిగిన వార్షిక ఏనుగుల ఉత్సవంలో ఎలిఫెంట్ ఫుట్‌బాల్‌ను నిర్వహించారు. ఈ ఫుట్‌బాల్ ను కూడా అచ్చంగా ఫుట్‌బాల్ నియమాలతోనే ఆడతారు, ఆటగాళ్లు ఏనుగులపై స్వారీ చేస్తుండగా, ఏనుగులు గోల్ చేయడానికి ప్రత్యర్థి జట్టు వలలోకి బంతిని తన్నడానికి ఫుట్‌బాల్ క్రీడాకారుల్లాగే తమ వంతు ప్రయత్నిస్తాయి. ఈ ఫెస్టివల్ సందర్భంగా ఏనుగులు చిత్వాన్ లోని ప్రధాన పర్యాటక కేంద్రమైన సౌరహా లో చిత్వాన్ నేషనల్ పార్క్ గేట్ నుంచి ఉత్సవ వేదిక వరకు ఏనుగులు వీధుల గుండా కవాతు చేశాయి, అక్కడ అవి పెనాల్టీ షూటౌట్ పోటీలో పాల్గొని అందరినీ ఆకర్షించాయి.
జంతు హక్కుల కార్యకర్తల అభ్యంతరాల కారణంగా ఆగిపోయిన నేపధ్యంలో... చాలా సంవత్సరాల విరామం తర్వాత ఈ ఏనుగుల పర్యాటక ఉత్సవం 19వ ఎడిషన్ ను నిర్వహించారు. ఈ సంవత్సరమే తొలిసారిగా పెనాల్టీ షూటౌట్ పోటీని ప్రవేశపెట్టారు. ఇది పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి ఏనుగుల సంరక్షణను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.
‘చిత్వాన్ ఏనుగుల ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది. ఇది మాకు దీనికి హాజరు కావడానికి వచ్చే ప్రజలకు కూడా ఒక కానుక. ఈ ఉత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకే ఈ ఏనుగుల ఫుట్‌బాల్‌ను ప్రారంభించాం, మూడు రోజుల పాటు ఉత్సవం ఉంటుంది‘ అని సౌరహాకు చెందిన ఏనుగుల సంరక్షకుడు శాంతే మహతో తెలిపారు. సౌరహాలోని బాగ్‌మారా బఫర్ జోన్ కమ్యూనిటీ ఫారెస్ట్‌లో జరుగుతున్న ఈ ఉత్సవం గత సోమవారంతో ముగిసింది. సౌరహాకు దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలను పెంచడమే ప్రాథమిక లక్ష్యంగా సాగిన ఈ ఉత్సవాల పొడవునా అనేక రకాల సాంస్కృతిక క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించారు.
మొదటి రోజు, చిత్వాన్ నేషనల్ పార్క్ ప్రవేశ ద్వారం నుంచి ఊరేగింపు ఆ తర్వాత ఏనుగుల పెనాల్టీ షూటౌట్ పోటీ, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే రెండవ రోజు, ఈ ఉత్సవంలో సాంప్రదాయ సంగీతంతో కూడిన ఏనుగుల అందాల పోటీలు, ఏనుగుల ఆరోగ్య శిబిరం, సంభాషణ కార్యక్రమాలు, పడవ పందాలు, అదనపు క్రీడా పోటీలు జానపద పాటలు, నృత్యాలను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజున ఏనుగుల పూజ, ఏనుగులతో విందు, పోటీల ఫలితాల ప్రకటన, బహుమతులు థృవ పత్రాల పంపిణీ, అధికారిక ముగింపు వేడుక నిర్వహించారు.


