తాత్త్వికథ
భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఆఫీస్‌లో అలసిపోయిన వారిద్దరూ ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే వారి ఆరేళ్ళ కొడుకు బడినుంచి ఇంటికి వచ్చి ఉన్నాడు.
తమ పుత్రరత్నం, చుట్టుప్రక్కల ఉన్న స్నేహితులనంతా ఇంటికి పిలిచి ఉన్నాడు. వారందరూ చేరి ఇల్లంతా పీకి పందిరి వేసి ఉన్నారు. భార్యాభార్తలిద్దరికీ కోపమొచ్చింది. ఇరుగు΄÷రుగు పిల్లల్ని గట్టిగా అరిచారు. తమ పుత్రరత్నాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
అమ్మనాన్నల తిట్లకు వాడు బుంగ మూతి పెట్టి సోఫాలో కూర్చుండిపోయాడు. వారిలో కోపం తగ్గలేదు. అలా బయటికి వెళ్ళి వస్తే మామూలు స్థితికి వస్తామనిపించింది. ఇద్దరూ ఇంటి బయటికి వచ్చారు. దగ్గరలోనే ఓ కళ్యాణ మంటపం ఉంది. ఆ రోజు ఆ కళ్యాణ మంటపంలో ఓ ఉత్తర భారత దేశ చిత్రకారుడు తన చిత్రాల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. వాటిని చూద్దామని అక్కడికి వెళ్ళారు.
మొత్తం చిత్రాలన్నీ పిల్లల చిత్రాలే. అందంగా అమాయకంగా ఉన్నాయి. మరికొన్ని కొంటె చూపుల్తో, పెద్దపెద్ద కళ్ళతో, కవ్వింపు ముఖంతో చూడముచ్చటగా ఉన్నాయి. మూడు వందలకి పైగా ఉన్న ఆ పిల్లల చిత్రాలన్నీ ఆ చిత్రకారుడు గీసినవే. కన్నార్పకుండా చూశారు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించసాగాయి ఆ చిత్రాలు. చిత్రకారుడిని అభినందించాలని అతడి దగ్గరకు వెళ్ళారు.
‘మీకు మీ పిల్లలంటే చాలా ఇష్టం కాబోలు, వారు చిన్నప్పుడు ఇంత అందంగా ఉండేవారేమో. అందుకే జీవం ఉట్టిపడేట్లు గీయగలిగారు’ అన్నారు. అతడు ఏమీ మాట్లాడలేదు. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.
చిత్రపటాలను సర్దుతున్న చిత్రకారుడి సహాయకుడు వీరిని పక్కకి పిలిచాడు. చిన్న గొంతుతో ‘ఆయనకు పెళ్లై పాతికేళ్ళయ్యింది కానీ, పిల్లలు లేరు. పుట్టే అవకాశం కూడా లేదు. పుట్టి ఉంటే ఇలా ఉంటారన్న ఊహే అతడిలోని చిత్రకారుడిని నిద్ర లేపింది. పెళ్లి అయ్యేంతవరకు అతడు చిత్రకారుడు కాదు. పిచ్చి గీతలు గీసే మనిషి మాత్రమే. పిల్లలు పుట్టరన్న విషయం తెలిసాకే అతడిలోని చిత్రకారుడు మేల్కొన్నాడు’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
నీరు లేని నాడే కదా నీటి విలువ తెలుస్తుందన్న విషయం గుర్తుకొచ్చింది భార్యాభర్తలకి. ‘పిల్లలన్నాక గొడవ చేయడం సహజం, మనకి పిల్లలున్నారు కాబట్టి మనకి వారి విలువ తెలియడం లేదు. పిల్లలు లేని వారి బాధ వర్ణనాతీతం కదా’ అని ఆలోచించారు. పరుగుపరుగున ఇంటికి వెళ్ళారు. కొడుకుతో పాటు వాడి మిత్రులకంతా తీపి మిఠాయిలు పంచారు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు


