ఒకప్పుడు బాల్యం ఇంట్లో కంటే, ఇంటి బయటే ఎక్కువ ఉండేది. పరుగులాట, కోతికొమ్మచ్చి, బిళ్లంగోడు, గాలిపటాలు, దొంగాట... ఇలా పిల్లలు ఇంటి బయటే ఎక్కువగా ఉండేవారు. చెమటలు కారుతున్నా ఆటలు ఆపకపోవడం, అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకపోవడం, ఆకలయ్యేంత వరకు ఇల్లు గుర్తురాకపోవడం, ఒక్కోసారి ఆకలి కూడా మరచిపోయి ఆడుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం.
ఆ బాల్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈరోజు పిల్లల బాల్యం ఒక చిన్న స్క్రీన్‌లో మొదలై, అదే స్క్రీన్‌లో ముగుస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఒక తరం మౌనంగా కోల్పోతున్న జీవితం.
ఇప్పటికీ ఆలస్యం కాలేదు. గేటు తెరవండి. ఫోన్ పక్కన పెట్టండి. పిల్లల బాల్యాన్ని మళ్లీ బయటకు తీసుకురండి. బాల్యం ఎందుకు బయటే ఎదగాలి?
పిల్లల మెదడు పుస్తకాలతో కాదు, అనుభవాలతో ఎదుగుతుంది. ఆ అనుభవాలు ఎక్కువగా బయట ప్రపంచం నుంచే వస్తాయి. బయట ఆడే ఆటల్లో పిల్లలు కేవలం శరీరాన్ని కాదు, మెదడును కూడా ఉపయోగిస్తారు.
ఎక్కడ పరుగెత్తాలి? ఎక్కడ ఆగాలి? ఎవరితో కలిసి ఆడాలి? ఎవరితో తగువుపడాలి? ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు ఎదురు నిలవాలి?... ఇవన్నీ ప్లానింగ్, నిర్ణయాలు, స్వీయ నియంత్రణకు మూలాలు. వీటినే సైకాలజీలో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్’ ప్రకారం, పిల్లలు బయట ఆడే ఆటలు మెదడులో న్యూరల్ కనెక్షన్లను సహజంగా బలపరుస్తాయి. కాని ఇప్పుడా అనుభవాలన్నీ స్క్రీన్‌కు అతుక్కుపోయియి.
స్క్రీన్ ఎందుకు ప్రమాదకరం?
స్మార్ట్‌ఫోన్ సమస్య అది చూపే కంటెంట్ కాదు, అది పనిచేసే విధానం. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌ల ఉద్దేశం ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉంచడమే, పిల్లలకు ఉపయోగపడాలని కాదు. ఈ యాప్‌లు డోపమైన్ రసాయనాన్ని చిన్న చిన్న మోతాదుల్లో విడుదల చేస్తూ, పిల్లల మెదడును నిరంతర ఉత్సాహంలో ఉంచుతాయి.
బయట ఆటల్లో ఆనందం రావాలంటే శ్రమ అవసరం. స్క్రీన్‌లో ఆనందం రావాలంటే ఒక టచ్ చాలు. మెదడు ఈ తేడాను త్వరగా నేర్చుకుంటుంది. దీనివల్ల పిల్లలు తక్షణ ఆనందానికి అలవాటుపడతారు. ఓర్పు తగ్గిపోతుంది. బోర్‌డమ్‌ను భరించలేని మనస్తత్వం, అసహనం, చిరాకు పెరుగుతాయి.
బోర్ కూడా అవసరం..
‘మా పిల్లాడు త్వరగా బోర్ అవుతున్నాడు సర్. అందుకే ఫోన్ ఇస్తుంటాం’ అని చాలామంది తల్లిదండ్రులు చెబుతుంటారు. వాస్తవానికి బోర్ అవ్వడం పిల్లలకు ఒక అవసరం. బోర్ అవ్వడం అంటే ఖాళీగా ఉండడం కాదు. అది మెదడుకు ఒక విరామం. ఆ విరామంలోనే ఊహాశక్తి పుడుతుంది, కొత్త ఆటలు పుట్టుకొస్తాయి, సృజనాత్మకత మేల్కొంటుంది. స్మార్ట్‌ఫోన్ పిల్లల జీవితంలో బోర్‌డమ్‌ను పూర్తిగా తొలగించింది.ప్రతి నిమిషం ఏదో ఒకటి చూపిస్తూ, పిల్లల మెదడును వినోదానికి బానిసగా మార్చేసింది.
పరిష్కారాలు...
→ రోజుకు కనీసం గంట బయట ఆట తప్పనిసరి చేయండి. చలిగా ఉందని, ఎండగా ఉందని సాకులు చెప్పొద్దు. ఆటకు వాతావరణ అడ్డుకాకూడదు.
→ స్క్రీన్‌ను హక్కుగా కాదు, రివార్డుగా మార్చాలి
→ డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, పడకగదిలో ఫోన్ అనుమతించకూడదు
→ పిల్లలతో కలిసి బయటకి వెళ్లండి. ఆడకపోయినా, అక్కడ ఉండండి
→ పిల్లలు బోర్ అయితే వెంటనే స్క్రీన్ ఇవ్వకండి. ఆ బోర్లోనే ఎదుగుదల ఉంటుంది
బయట ఆటలు లేకపోతే...
పిల్లలు బయట ఆటలు ఆడకపోతే నాలుగు ముఖ్యమైన సామర్థ్యాలు కోల్పోతారు.
→ రిస్క్ అంచనా వేసే సామర్థ్యం: ఎక్కితే పడిపోతామో లేదో తెలుసుకోవడం → సోషల్ నెగోషియేషన్: ఆటలో గొడవలు, ఒప్పందాలు, రాజీలు
→ శరీర అవగాహన: బ్యాలెన్స్, కోఆర్డినేషన్, స్థల జ్ఞానం
→ నిజమైన విజయ భావన: కష్టపడి సాధించిన ఆనందం ఈ నాలుగు అంశాలను ఏ స్క్రీన్ ఇవ్వలేదు.
భయపెట్టే గణాంకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకుస్క్రీన్ పూర్తిగా నిషిద్ధం. ఐదేళ్ల పిల్లలకు రోజుకు గంట కంటే ఎక్కువ స్క్రీన్ ఉండకూడదు. కాని, మనదేశంలో 3–6 ఏళ్ల పిల్లలు సగటునరోజుకు 3–5 గంటలుస్క్రీన్ చూస్తున్నారు. నగరాల్లో 60 శాతానికి పైగా పిల్లలు రోజుకు 30 నిమిషాలు కూడా బయట ఆడటంలేదు. 1990లతో పోలిస్తే పిల్లల ఔట్‌డోర్ ఆటల సమయం 70 శాతం తగ్గింది.


