నాకు ఇద్దరు కూతుళ్ళు. వయసు 8ఏళ్ళు, 6 ఏళ్ళు. మేము విడిపోయి 2 సంవత్సరాలవుతోంది. పిల్లలు నా భార్య వద్దనే ఉన్నారు. వాళ్లని చూడాలని ఉంది కానీ ఆమె నాకు చూపించకపోగా నామీద క్రిమినల్ కేసు, మెయింటెనెన్స్ కేసు వేసింది. పిల్లల్ని చూడాలంటే వారికి నానుంచి హాని ఉంది అని చెప్తుంది. పిల్లల్ని ఒకసారి కోర్టుకు తెస్తే, జడ్జిగారికి పిల్లల చేత ‘మా నాన్న మంచివాడు కాదు’ అని చెప్పించారు. నిజానికి పిల్లలు నాతో చాలా బాగా ఉండేవారు. తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా? నాతో ఎంతోబాగుండే పిల్లలు ఇలా అయ్యారు అంటే, తనే నేర్పించింది అని అనిపిస్తుంది. ఏం చేయాలో చెప్పగలరు.
– సంపత్, విశాఖపట్నం
ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. చాలా కేసులలో ఇలాంటి ధోరణి చూస్తుంటాము. అనేక కారణాలు ఉంటాయి. ‘‘తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా?’’ అని అడిగారు. తల్లిదండ్రులకి పిల్లలపై హక్కు మాత్రమే కాదు బాధ్యత ఉంటుంది. తల్లితండ్రుల ప్రేమ, ఆదరణ సమానంగా పొందే హక్కు పిల్లలకు ఉంటుంది. అంటే ప్రథమంగా అది పిల్లల హక్కు. మీ హక్కు కాదు. చట్టాలు చిన్నపిల్లల శ్రేయస్సు కోసమే ఉన్నాయి.
వారి శ్రేయస్సు ముందు ఎవరి హక్కు అయినా చిన్నదే! భార్యాభర్తలు విడిపెయిన సందర్భాలలో పిల్లలను ఆయుధంగా వాడుకోవాలి అనుకోవడం దాదాపుగా అన్ని కేసులలో చూస్తుంటాము. అది తప్పు. భార్యాభర్తలు ఒకరికొకరు మంచివారు కాక΄ోయి ఉండొచ్చు. అంతమాత్రాన మంచి తల్లిదండ్రులు కాదని చెప్పలేము. విడి΄ోయిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారు సాధారణంగానే అవతల వారిపై వ్యతిరేక భావనను పిల్లలలో పెంచుతుంటారు. విజ్ఞత కోల్పోతుంటారు.
చిన్నారుల పసి హృదయాలపై వారు ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోలేనంత స్థాయిలో ప్రవర్తన మారి΄ోతూ ఉంటుంది. మీ విషయానికి వస్తే, రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్న మీరు పిల్లలు కావాలి అని కేసు ఎందుకు వేయలేదు? పిల్లల శ్రేయస్సు కోసం మీరు ఏం చేశారు? మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తున్నారా? ఇలాంటివి కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కేసులో లబ్ధి కోసం ఉన్నట్లుండి పిల్లలపై ప్రేమ ఉన్నట్టు చూపించుకోవాలి అనుకుంటే కోర్టులు నమ్మవు! ఇప్పటికైనా పిల్లలపై బాధ్యతను నెరవేరుస్తూ, వారికి కస్టడీ మీకు కూడా కావాలి అని గార్డియన్స్ అండ్ వర్డ్స్ చట్టం కింద కేసు వేయవచ్చు.
పిల్లల అభిప్రాయాలను బలవంతంగా మార్చారు అని మీరు ఖచ్చితంగా అనుకుంటే, మీ ఇద్దరు పిల్లలను సైకాలజిస్ట్ వద్దకు పంపాలి అని మధ్యంతర దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన కారణాలను చూపాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడాలి. తల్లిపైన లేదా తండ్రిపైన విష ప్రచారం చేయకూడదు. అలా చేస్తున్నవారికి నా విన్నపం ఏంటంటే: మీరు కేసులు గెలవచ్చు కానీ మున్ముందు పిల్లల భవిష్యత్తును కోల్పోతారు. జాగ్రత్త వహించాలి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)
(చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!)


