‘నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను’ అనే మాట తిరుపతమ్మ నోటి నుంచి వినిపించినప్పుడు ఎంతమంది సీరియస్‌గా తీసుకొని ఉంటారో తెలియదు. ఆమె మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ‘నువ్వు పోటీ చేయడం ఏమిటి!’లాంటి వెక్కిరింపులకు తన విజయంతో దీటైన సమాధానం ఇచ్చారు తిరుపతమ్మ. ఆమె ఎత్తు మూడు అడుగులు.
ఆమె ఆత్మవిశ్వాసం... ఎవరెస్ట్ అంత!
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామ చరిత్రలో తొలిసారి విశేష ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఇల్లందుల తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి, సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు. ఆమెతో పాటు ఆమె ప్యానెల్‌లోని పన్నెండు మంది వార్డు సభ్యులు కూడా విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయం మహిళలకు, ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
రెక్కల కష్టం నమ్ముకొని...
తిరుపతమ్మ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం తిరుపతమ్మ, సోదరుడు సుదర్శన్ భుజాలపై పడింది. ఇద్దరు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆ తర్వాత తిరుపతమ్మ ఉపాధి హామీ పథకంలో వాచర్‌గా ఉద్యోగం సంపాదించారు. వాచర్‌గా పనిచేస్తూ ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి దగ్గరయ్యారు. గ్రామస్తుల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేశారు. ప్రజల తలలో నాలుక అయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు# ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఒక్కపూట భోజనానికే ఇబ్బంది పడిన రోజులు ఉన్నా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు.
నా విజయ రహస్యం... ఆత్మవిశ్వాసం
ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే నా బలం. ఎన్నికలు నాకు కొత్త కావచ్చు. కాని గ్రామ ప్రజలు కొత్తవారు కాదు. వారు నా కుటుంబ సభ్యులు. ‘మంచి చేస్తే మంచే జరుగు తుంది’ అని బలంగా నమ్ముతాను. తమ్ముడు సుదర్శన్ చేసిన సేవలు, ప్రజలకు నాపై ఉన్న నమ్మకం సర్పంచ్‌గా నా గెలుపుకు కారణం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. – ఇల్లందుల తిరుపతమ్మ
– కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామ


