"నిస్వార్థమెంత గొప్పదో…
నీ పదము రుజువు కట్టదా..
సిరాలు లక్ష ఓంపదా
చిరాక్షరాలు రాయదా".. అనే పాట గుర్తుకొస్తుంది ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే..ఈ వ్యక్తి ని ప్రమాదంలో కోల్పోయి తీరని దుఃఖంలో కోరుకుపోయాడు. చివరికి విధి భార్యను తీసుకుపోయి ఒంటిరిగా చేసింది. కానీ అతడు ఆ బాధలో మగ్గిపోకుండా తనలా విధి వంచితులవ్వకూడదని..ట్రాఫిక్ పోలీసులా ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాలక్రమేణ అందరూ అతడని ట్రాఫిక్ పోలీసనే అనుకునేవారు, అతడిని పలకరిస్తే గానీ అసలు విషయం తెలిసేది కాదు. కానీ అతడి నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు రావడమే కాదు..చుట్టుపక్కల స్థానికులు సైతం అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఎవరా ఆ వ్యక్తి..ఏమా కథ తెలుసుకుందామా..!
ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 79 ఏళ్ల వృద్ధుడు లాఠీతో నిలబడి ఉంటాడు. ఈ ఏజ్‌లో కూడా అక్కడ వాహనాలను నియంత్రిస్తూ డ్యూటీ చేస్తున్న ఆ వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా కుతూహలం కలుగుతుంది. ఇంకా రిటైర్ కాలేదా..ఉచితంగా సర్వీస్ అందిస్తున్నాడా..అన్న అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అతడి పేరు గంగారాం. ఓ విషాదం తన జీవితాన్ని ఇలా మార్చేసిందంటాడు.
తన కొడుకు తాను కలిసి టివీ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపైర్ షాపు నడిపేవారు. ఒకరోజు అనుకోకుండా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ దఃఖం అతడ్ని తీవ్రంగా కుంగదీసేసింది. చివరికి అతడి భార్య సైతం ఆ బాధను జీర్ణించుకోలేక అతడిని ఒంటిరి చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక్క దుర్ఘటన తన కుటంబాన్ని ఇంతలా చిన్నాభిన్నం చేయడంతో గంగారాం..ఇలాంటి భాధ పగవాడికి కూడా వద్దు అని స్ట్రాంగ్ ఫిక్స్ అవ్వుతాడు.
ఆ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు మాదిరిగా డ్రెస్ వేసుకుని ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలను నియంత్రిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా ఆ జంక్షన్ వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి జీతంభత్యం లేకుండా పనిచేశాడు. అలా రోజుకి సుమారు పది గంటలకు పైగా డ్యూటీ చేస్తుండేవాడు. మొదట్లో అతడిని కొందరు మోసగాడని తప్పుగా భావించేవారు, కాలక్రమేణ అతడి "నిస్వార్థ సేవ"ను గుర్తించడం ప్రారంభించారు. ఎవ్వరైనా అతడికి ఉచితంగా ఆహారం, డబ్బులు ఇచ్చినా నిరాకరించేవాడు.
అలా ఏళ్ల తరబడి నిస్వార్థంగా ఎలాంటి జీతం తీసుకోకుండా ట్రాఫిక్ పోలీసులా సేవలందించాడు. అంతేగాదు రోడ్డుపై క్రమశిక్షణతో మెలిగితేనే ప్రాణాలను సురక్షితమనేది గంగారాం ప్రగాఢ నమ్మకం. దాన్నే ప్రజలకు పదే పదే చెబుతుండే వాడు కూడా. వయసు సహకరించకపోయినా, అనారోగ్యంగా ఉన్నా.. తన డ్యూటీకి మాత్రం విరామం ఇచ్చేవాడు కాదు. కనీసం కరోనా మహమ్మారి, సమయంలో ప్రభుత్వం సీనియర్ సిటీజన్లను పదే పదే ఇంట్లో ఉండమని విజ్ఞప్తి చేసినా..తన దినచర్యకు కట్టుబడి ఉండేవాడు గంగారామ్. ఆఖరికి వర్షం, భగభగ మండే వేసవిలో సైతం అతడి డ్యూటీకి బ్రేక్ వేయలేకపోయాయి.
ఆ సేవ వృధాగా పోలేదు..
ఏళ్ల తరబడిచేస్తున్న అతడి సేవలు పోలీసులు, సామాజికి సంస్థలు గుర్తించి అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించింది. తరుచుగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాలలో అతడిని పిలిచి మరి తన సేవకు తగిన సత్కారం చేసి అభినందించేవారు. చివరగా 2018లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని అధికారికంగా ట్రాపిక్ సెంటినల్‌గా నియమించి, దశాబ్దాలులగా ఉచితంగా అందిస్తున్న సేవకు తగిన గుర్తింపు అందించారు.
అంతేగాదు అతనికి మొబైల్ ఫోన్ కూడా అందించి,తగిన వేతనం అందేలా చేసిందిఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు గంగారామ్ సగర్వంగా యూనిఫాం ధరించి తన విధులను ఈ ఏజ్‌లో కూడా నిర్వర్తిస్తూ..తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాడు.
(చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!)


