ప్రపంచం చుట్టి రావాలనుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద విషయం కాదు. డబ్బుకి లోటు లేదు అనుకుంటే సులభంగా చుట్టొచ్చేయొచ్చు. అలాకాకుండా కాలినడకన చుట్టి రావాలనుకోవడం మాత్రం..కాస్త ఆలోచించాల్సిందే. అసలు ఈ ఆలోచన సాధ్యమేనా అనే సందేహం కచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఇతడు దృఢ సంకల్పమే ఆయుధంగా ఎలాంటి వాహనాలను ఉపయోగించకుండా కాలినడకన ప్రపంచం చుట్టి రావాలనుకున్నాడు. ఇప్పుడు దాదాపు చాలామేరకు చుట్టేశాడు. ఇంకొద్ది రోజుల్లో అతడి యాత్ర ముగింపుకి రానుంది. ఇంత పెద్ద ఘనతను సృష్టించిన ఆ వ్యక్తి ఎప్పుడు ఈ ప్రపంచ యాత్రను ప్రారంభించాడు?, ఎలా సాగింది వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
29 ఏళ్ల బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ కార్ల్ బుష్బీ, ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఎలాంటి మోటారు వాహనాలు ఉపయోగించకుండా ప్రపంచం చుట్టి రావాలనే అసాధారణ లక్ష్యంతో బయలుదేరాడు. ఇప్పటికీ అతడి కల తీరనుంది. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ యాత్ర అనంతరం 56 ఏళ్ల వయసుకు చేరుకున్న దశలో పూర్తి చేయనున్నాడు. అప్పటికీ పూర్తిగా మారిపోయిన ప్రపంచం, మరోవైపు సోషల్ మీడియా ఒత్తిడి వంటి సవాళ్లను అధిగమించి మరి ప్రపంచ యాత్రను ఇంకొద్ది రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయనున్నాడు.
తన యాత్ర పూర్తి అవ్వడానికి జస్ట్ వెయ్యి మైళ్ల దూరంలోనే ఉన్నాడంతే. ఇప్పటి వరకు చేసిన సాహస యాత్రల్లో ఈ వ్యక్తి చేసిన యాత్ర అత్యంత సుదీర్ఘమైన యాత్రగా నిపుణులు పేర్కొన్నారు. ఇక బుష్బీ తన ప్రపంచ యాత్రను 1998లో చిలీ సరిహద్దుల నుంచి ప్రారంభించాడు. అలా నడుచుకుంటూనే తన స్వదేశం ఇంగ్లాండ్‌కు చేరుకుంటానని భీష్ముడు మాదిరిగా ప్రతినబూనడట. ఇంతవరకు ఈ యాత్రలో ఎలాంటి యాంత్రిక రవాణాను వినయోగించకపోవడం విశేషం.
ఇప్పడు తన యాత్ర చివరి దశలో ఉన్నాడు. అంతేగాదు అతడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 2026 నాటికి తన స్వస్థలమైన ఇంగ్లాండ్‌కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నన్నా. ఇప్పటి వరకు 25 దేశాలు, ఎడారులు, యుద్ధ ప్రాంతాలు, అడవులు, గడ్డకట్టిన సముద్రాలను దాటాడు. ఈ డేరింగ్ యాత్ర అతడి అద్భుతమైన ఓర్పు, సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోంది.
ప్రస్తుతం 27 ఏళ్ల అనంతరం బుష్బీ ప్రయాణం పటగోనియా, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా, మెక్సికో, యుఎస్, రష్యా, మంగోలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల గుండా సాగనుంది. అతడు బ్రిటిష్ సైన్యంలో పారాటూపర్‌గా పనిచేసిన అనుభవమే ఈ సాహన యాత్రకు పురికొల్పిందని అంటాడు బుష్బీ. సైన్యంలో ఉన్నప్పుడూ అద్భుతమైన ప్రదేశాలను చూశాను. అదే తనని ఈ ప్రపంచమంతా చుట్టిరావాలనే సంచార కాంక్షను ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు.
యాత్ర సాగిన విధానం..
బుష్బీ 31,000-మైళ్ల యాత్ర సుమారు ఎనిమిది నుండి పన్నెండేళ్లు పడుతుందని అతను అంచనా వేశాడు. 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక భౌగోళిక రాజకీయ, ఆర్థిక, లాజిస్టికల్ అడ్డంకుల కారణంగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంగా మారిపోయింది.
అతను తన నడకను దక్షిణ అమెరికా దక్షిణ కొనలో ఉన్న చిలీలోని పుంటా అరేనాస్‌లో ప్రారంభించాడు. పనామా, కొలంబియా మధ్య ఉన్న ప్రమాదకరమైన డారియన్ గ్యాప్‌ను దాటడంతో సహా అమెరికా ఖండాల పొడవునా నడిచాడు. మార్చి 2006లో, అతను తోటి సాహసికుడు డిమిత్రి కీఫర్ అలాస్కా నుండి సైబీరియాకు కాలినడకన గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని దాటిన మొదటి వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.
అనధికారిక సరిహద్దు పాయింట్‌లోకి ప్రవేశించిన తర్వాత వీసా సమస్యలు, ఐదు సంవత్సరాల ప్రవేశ నిషేధం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. దాంతో రష్యా గుండా వెళ్లటం సాధ్యపడలేదు. టండ్రా పరిస్థితుల దృష్ట్యా శీతాకాలం చివరిలో, వసంతకాలం ప్రారంభంలో మాత్రమే నడక మార్గం అనుకూలంగా ఉండేది బుష్బీకి.
ఆగస్టు 2024లో, రాజకీయ ప్రమాదాల కారణంగా ఇరాన్ లేదా రష్యాలోకి ప్రవేశించకుండా కజకిస్తాన్ నుంచి అజర్‌బైజాన్‌కు కాస్పియన్ సముద్రం మీదుగా ఈదాడు. దీనికై విశ్రాంతి కోసం సహాయక పడవలతో 31 రోజులు పట్టిన 179-మైళ్ల క్రాసింగ్.
ఆ తర్వాత కాకసస్, టర్కీ గుండా నడిచాడు, 2025లో బోస్ఫరస్ జలసంధిని దాటి యూరప్‌లోకి ప్రవేశించాడు. 2025 చివరి నాటికి, అతను యూకే నుంచి 1,400 మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న రొమేనియా గుండా నడక ప్రారంభించాడు.
అయితే బుష్బీ సంకల్పించినట్లుగా తన ప్రధాన నియమం విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తపడ్డాడు. కాలినడకనే తిరిగి ఇంటికి వెళ్లానే తన పట్టుదలను ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం బుష్బీ హంగేరీలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లోని తన స్వస్థలమైన హల్ నుంచి దాదాపు 932 మైళ్ల దూరంలో ఉన్నాడు. అతడి యాత్ర విజయవంతమైతే గనుక నిరంతరాయంగా నడిచిన తొలి వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుని రికార్డు క్రియేట్ చేస్తాడు.
చివరగా బుష్బీ 29 ఏళ్ల వయసులో ప్రపంచ యాత్ర మొదలుపెడితే 56 ఏళ్ల వయసుకు పూర్తి చేయనున్నాడు. నిజంగా ఇది అతిపెద్ద డేరింగ్ యాత్ర కదూ..!
(చదవండి: ఆ యువ సైక్లిస్ట్ గట్స్‌కి మాటల్లేవ్..! ఆ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం..)


