డ్రోన్ దాడిలో 33 మంది చిన్నారులు సహా 50 మంది మృతి
కైరో: సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు చిన్నారులను కూడా బలి తీసుకుంటోంది. తాజాగా, గురువారం దక్షిణ కొర్డొఫాన్ రాష్ట్రంలోని కలోగీ పట్టణంలో కిండర్‌గార్టన్‌పై పారా మిలటరీ బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో కనీసం 50 మంది చనిపోగా వీరిలో 33 మంది చిన్నారులులేనని సూడాన్ డాక్టర్స్ నెట్‌వర్క్ అనే సంస్థ తెలిపింది. మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది.
అయితే, సమాచార వ్యవస్థలను స్తంభింపజేయడంతో కచ్చితమైన వివరాలు తెలియడం లేదంది. క్షతగాత్రులకు వైద్య సిబ్బంది చికిత్స చేస్తున్నారని తెలిపింది. స్కూల్‌లో ఉండగా చిన్నారులను చంపడం చిన్నారుల హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని యూనిసెఫ్ సూడాన్ ప్రతినిధి షెల్డన్ యెట్ పేర్కొన్నారు. సంక్షోభాలకు చిన్నారులను బలి చేయడం తగదన్నారు. చమురు నిక్షేపాలున్న కొర్డొఫాన్‌పై ఆధిపత్యం కోసం ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య గత కొన్ని వారాలుగా తీవ్ర పోరు సాగుతోంది.


