ఆయన ఆలోచనలు, ఆశయం పరుగుపెడతాయి.. విజయాన్ని దక్కించుకోవాలన్న సంకల్పం పరుగుకు ముందుంటుంది. అందుకే ఆయన ముందు మారథాన్‌లు చిన్నబోతున్నాయి. 74 ఏళ్ల వయసులోనూ మారథాన్‌లు, అల్ట్రా మారథాన్‌లు పూర్తి చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నూకలవారిపాలెం నుంచి వచ్చిన అతని ప్రస్థానం ఇప్పుడు బోస్టన్ మారథాన్ వరకూ పరుగుతీసింది. ఆయనే హైదరాబాద్‌కు చెందిన సీనియర్ రన్నర్ నాగభూషణరావు చలమలశెట్టి..
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నూకలవారిపాలేనికి చెందిన నాగభూషణరావు ప్రస్తుతం నగరంలోని మల్లాపూర్‌లోని కేఎల్ రెడ్డి నగర్‌లో నివసిస్తున్నారు. వయసు పెరుగుతోందని వెనక్కి తగ్గకుండా.. ఆరోగ్యమే జీవితానికి అసలైన బలం అన్న సందేశాన్ని తన పరుగుతో నిరూపిస్తున్నారు. పరుగుల ప్రపంచంలోకి ఆయన ఐదేళ్ల క్రితం అడుగుపెట్టారు.
అమెరికాలోని చికాగోలో అతని కుమారుడు మారథాన్ పూర్తి చేశారు. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభంలో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వంటి చిన్న దూరాలతో మొదలుపెట్టి క్రమంగా స్టామినాను పెంచుకున్నారు. ఆ క్రమశిక్షణే దేశంలోని ప్రముఖ మారథాన్‌లలో నిలబెట్టేలా చేసింది.
ఇది ఆయన రికార్డు..
ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల మారథాన్‌లతో పాటు లోనావాల నైట్ అల్ట్రా మారథాన్, 65 కిలోమీటర్ల సతారా అల్ట్రా మారథాన్ వంటి కఠిన పోటీలను ఆయన అవలీలగా పూర్తి చేశారు. ఇటీవల లద్దాఖ్ మారథాన్ సైతం పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మారథాన్‌ను విజయవంతంగా ముగించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఇప్పటివరకు 21 ఫుల్ మారథాన్‌లలో పాల్గొని 17 విజయాలను నమోదు చేశారు.
వచ్చే ఏడాది బోస్టన్ మారథాన్‌కు..
ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఢిల్లీ మారథాన్‌ను ఆయన 4 గంటల 12 నిమిషాల 55 సెకన్ల సమయంలో ముగించారు. దీంతో ఆయన వచ్చే ఏడాది అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న 130వ బోస్టన్ మారథాన్‌కు అర్హత సాధించారు. భారత్ తరుపున పాల్గోనున్న ఆయన, హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలవనున్నారు.
(చదవండి: పర్యావరణ హిత మష్రూమ్ ఫర్నీచర్..! జస్ట్ 180 రోజుల్లోనే..)


