ఆటను మించి.. అందరి మీదా ప్రభావం చూపిన అరుదైన అథ్లెట్లలో లియోనల్ మెస్సీ ఒకడు. చిన్నతనంలో ఎదుర్కొన్న శారీరక సమస్యలను అధిగమించి.. మేటిస్థాయి ఫుట్‌బాలర్‌గా అతడి ప్రయాణం అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసులు చూరగొన్న అత్యంత అద్భుతమైన ఆటగాడు అతడు.
ఓ అథ్లెట్ జీవితం ఎలా ఉంటుందో నాకూ తెలుసు. అందుకే అతడి పట్ల గౌరవ మర్యాదలు, ప్రేమ, ఆరాధానభావం కలిగిన వాళ్లను ఏరకంగానూ తప్పుబట్టను. ఇటీవలే మెస్సీ భారత పర్యటనకు వచ్చాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు నాకు బాధ కలిగించాయి. కాస్త అసౌకర్యానికి గురిచేశాయి.
ఈ హంగామా అంతా ఎందుకు?.. నేనేమీ ఈ విషయంలో న్యాయనిర్ణేతగా ఉండదలచుకోలేదు. కానీ ఈ తంతుతో మనం ఏం సాధించాలనుకుంటున్నామన్న ప్రశ్న నా మదిని తొలచి వేస్తోంది. క్రీడల చుట్టూ ఉండే ఆర్థిక విషయాల గురించి నాకు అవగాహన ఉంది. వాణిజ్యపరంగా, బ్రాండ్ ప్రమోషన్ల కోసం ఇలా చేస్తారనే స్పృహ కూడా ఉంది.
ఇక్కడ నేను ఏ రకంగానూ మెస్సీని తప్పుబట్టడం లేదు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అతడు దిగ్గజ స్థాయికి చేరాడు. అందుకు అతడి పట్ల ఆరాధనా భావం ఉండటం సహజమే. ఎదిగినా ఒదిగి ఉండటం కూడా గొప్ప విషయం.
అయితే, అభిమానం పేరుతో చేసే పనులు కూడా ఒక్కోసారి జడ్జ్ చేయబడతాయి. సమాజంలో క్రీడా సంస్కృతిని విస్తరించే బదులు.. మనం వ్యక్తి పూజకు పరిమితం అవుతున్నాం. లెజెండ్ల ఫొటోల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తాము నిజాయితీగా సంపాదించుకున్న డబ్బును ఇష్టారీతిన ఖర్చు పెట్టుకునే హక్కు ప్రజలకు ఉంటుందనేది నిజం.
కానీ ఎందుకో నా మనసు బాధతో మూలుగుతోంది. అతడి రాక, కార్యక్రమం విజయవంతం చేయడంలో పెట్టిన శ్రద్ధలో.. కాస్తైనా మన దేశంలోని క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పెట్టగలరా? స్వేచ్ఛగా పరిగెడుతూ ఆడుకునేందుకు ఇరుకుల్లేని మైదానాలు చిన్నారుల కోసం నిర్మించగలరా?
యువతరానికి మార్గదర్శనం చేసే కోచ్‌లను నియమించగలరా? ఆటలు కూడా చదువులో భాగంగా ఉంటాయి.. రోజూవారీ జీవితంలో అవీ భాగమే అని ఉపాధ్యాయులచే చెప్పించగలరా? బాల్యం నుంచే క్రీడాకారులకు బలమైన పునాది వేయగలరా?.. ఇవన్నీ జరిగితే బాగుంటుంది.
క్రీడల్లో గొప్పగా కనిపిస్తున్న దేశాలు ఒక్కరోజులోనే అదంతా సాధించలేదు. సాధారణ పిల్లాడు కలగన్న అసాధారణ కలలు నెరవేరడానికి వ్యవస్థలను సృష్టించి.. వాటిని సక్రమంగా నడిపిస్తున్నాయి. మెస్సీ వంటి ఐకాన్లు మనందరికీ ఆదర్శం. అయితే, ఇలాంటి కార్యక్రమాలతో పాటు.. క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేసేందు చొరవ, నిబద్ధత అవసరం.
మెస్సీ వంటి దిగ్గజాలను గౌరవించాలంటే ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి ఉండదు. దేశంలో క్రీడాకారుడు కావాలనుకునే ప్రతి చిన్నారికి ప్రోత్సాహం ఇవ్వడమే క్రీడా సంస్కృతికి, దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇది దోహదపడుతుంది
-భారత్‌కు విశ్వక్రీడల్లో మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణం అందించిన షూటర్ అభినవ్ బింద్రా మనుసులోని ఆవేదనకు ప్రతిరూపం ఇది. అతడొక్కడే కాదు.. దేశంలోని సగటు క్రీడాభిమాని మనసును తొలచి వేస్తున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఈ మాటలు.
గోట్ టూర్‌లో భాగంగా
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గోట్ టూర్‌లో భాగంగా శనివారం భారత్‌కు వచ్చాడు. ఈ ఈవెంట్ కోసం కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. అభిమానులు సైతం వేలాది రూపాయలు పోసి కొన్న టికెట్లతో మైదానాలకు వచ్చారు. అతడితో ఫొటో దిగేందుకు రూ. 10 లక్షలు అని చెప్పినా చాలా మంది ముందడుగే వేశారు.
మెస్సీని తప్పుబట్టాల్సిన పనిలేదు
మెస్సీ క్రేజ్‌కు ఇదొక నిదర్శనం. క్రికెట్‌ను మతంగా భావించే దేశంలోనూ ఈ స్థాయిలో అభిమానులు ఉండటం అతడిలోని క్రీడాకారుడు గర్వించదగ్గ విషయం. అభినవ్ బింద్రా చెప్పినట్లు ఈ విషయంలో ఏ రకంగానూ మెస్సీని తప్పుబట్టాల్సిన పనిలేదు.
అయితే, మెస్సీ పట్ల ప్రేమను చూపిస్తున్న కొంత మందికి స్థానిక హీరో సునిల్ ఛెత్రి ఘనతల గురించి అసలు తెలిసి ఉండకపోవచ్చు. నయా జమానాలో భారత ఫుట్‌బాల్‌కు టార్చ్‌బేరర్‌లా ఉన్న భాయిచుంగ్ భుటియా గురించి కూడా అతి కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు.
దేశం కోసం, దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచేందుకు ఎంతగానో కష్టపడిన ఇలాంటి హీరోలకు ఈ స్థాయిలో సన్మానం జరిగిన దాఖలాలు లేవన్నది పలువురి వాదన. మెస్సీతో పోలిస్తే వారి క్రేజ్ తక్కువే కావచ్చు.. కానీ ఆట, అందుకోసం వారు పడ్డ శ్రమ అతడి హార్డ్‌వర్క్‌కు ఏమీ తీసిపోవు.
స్థానిక హీరోలు గుర్తున్నారా?
మరి వారికి దక్కుతున్న ‘ప్రత్యేక గుర్తింపు’ ఏమిటి? క్రికెటర్లపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న చాలా మంది.. ఛెత్రి లాంటి ఫుట్‌బాలర్ల గురించి, వారి కృషి గురించి కాస్తైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా?
ఐపీఎల్‌లో ఆడే విదేశీ కుర్ర క్రికెటర్ల గురించి కూడా మనకో అవగాహన ఉంటుంది. కానీ వీరి సేవలను, వీరు ఆడే మ్యాచ్‌లను కనీసం పట్టించుకుంటామా?.. అఫ్‌కోర్స్ ఇష్టమైన ఆటను ఆరాధించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ మెస్సీ.. ఛెత్రి.. ఇద్దరూ ఫుట్‌బాలర్లే. అయితే, వారిపై చూపించే ప్రేమ, ఆదరణంలో తేడా ఉండటం విచారకరం.

మెస్సీ రాకతో మనకు ఒరిగిందేమిటి?
సరే.. మెస్సీ టూర్‌తో భారత క్రీడా వ్యవస్థకు ఏమైనా లాభం చేకూరుతుందా? లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇదొక కమర్షియల్ టూర్ తప్ప.. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని అభినవ్ బింద్రా వంటి మేటి అథ్లెట్లు కూడా చెబుతున్నారు. ఇంతకీ మెస్సీ రాకతో మనకు ఒరిగిందేమిటి?.. డబ్బున్న వాళ్లకు.. అతడిని నేరుగా చూసే వన్స్ ఇన్ ఏ లైఫ్‌టైమ్ ఛాన్స్, ఫొటోలు దిగడం తప్ప!..
అదొక్కటే సంతృప్తి
అన్నట్లు ఈ టూర్‌లో భాగంగా ముంబైలోని వాంఖడేలో మెస్సీ.. ఛెత్రిని ఆలింగనం చేసుకోవడం, అతడికి తన సంతకంతో కూడిన జెర్సీని ఇవ్వడం భారత సగటు ఫుట్‌బాల్ అభిమానికి సంతృప్తినిచ్చిన క్షణాల్లో ఒకటి. అదే విధంగా.. ప్రాజెక్ట్ మహాదేవ పేరిట రాష్ట్రంలో ఫుట్‌బాల్ ప్రతిభను వెలికితీస్తామని ప్రకటించడం ఇక్కడి హైలైట్లలో ఒకటి.
చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
చదవండి: Lionel Messi Net Worth 2025: నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. మెస్సీ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
Messi ignored everyone but hugged Sunil Chhetri. He knows the Greatest Footballer of our Nation. 🥹🐐pic.twitter.com/MqqyVmt2Gx
— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025


