అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA – ‘ఆటా’) ఆధ్వర్యంలో, హైదరాదాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు-2025’ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఈ ఏటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన జరిగింది.
ఆయన హిందీ సాహిత్య సృష్టి, భావనా ప్రపంచం, ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మక దృష్టికోణాన్ని తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేస్తూ వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు లోతైన చర్చలు జరిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ తొలి అధ్యక్షుడు – కవి నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి - హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ యాకూబ్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ సాహిత్య సదస్సును ప్రారంభించారు. జనరంజక సాహిత్యంతో శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొని, అందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు.
ఆయన రచనలు ఇతర భాషలలోకి అనువాదం కావడం, అనేక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాక, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ‘ఆటా’, ‘తానా’ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని సిధారెడ్డి అన్నారు. తెలుగులో నవలల పోటీలు నిర్వహించిన ఘనత ‘ఆటా’కు దక్కుతుందన్నారు. ఈ డిసెంబర్ చివరివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక, వైద్య సేవా కార్యక్రమాలను ‘ఆటా’ నిర్వహిస్తోంది.
అందులో భాగంగా ఆదివారం జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో సాహితీవేత్తలు ప్రసేన్, డాక్టర్ ఆర్. సుమన్ లత, ప్రొఫెసర్ సర్రాజు, శ్రీనివాస్ గౌడ్, రూప్ కుమార్, వారాల ఆనంద్, డాక్టర్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొని, జ్ఞానపీఠ విజేత అయిన శుక్లా రచనా ప్రస్థానం, ఆయన రచనా శైలి, కవిత్వం, కథలు, కథావస్తువులు, నవలలోని ప్రత్యేకత, సినిమాలుగా – దృశ్య రూపాలుగా వచ్చిన ఆయన రచనలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ‘ఆటా’ ఇండియా బోర్డు సభ్యులు రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, అలాగే సాహితీవేత్త రాధిక సూరి తదితరులు సమన్వయకర్తలుగా ఈ సుదీర్ఘ సాహిత్య సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
వచ్చే జూలైలో... బాల్టిమోర్‌లో ఆటా సదస్సు
‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, అలాగే రానున్న అధ్యక్షులు – ప్రస్తుత ‘ఆటా’ వేడుకల చైర్ సతీశ్ రెడ్డి పర్యవేక్షణలో, అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డ రచయిత వేణు నక్షత్రం సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. మూడున్నర దశాబ్దాలుగా నిత్యం వివిధ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు సాగున్న ‘ఆటా’ లక్ష్యాలనూ, కృషినీ జయంత్, సతీశ్‌రెడ్డి తదితరులు వివరించారు. హిందీ – తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ‘ఆటా’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు.
అలాగే, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ‘ఆటా’ వారి 19వ మహాసభలు, యువజన సదస్సు వచ్చే 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్నట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ప్రవాసంలో ఉన్న తెలుగువారినీ, వ్యాపారవేత్తలనూ, ఐటీ నిపుణులనూ, యువతరాన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికీ, కలసికట్టుగా ముందుకుపోవడానికీ మూడు రోజుల ఆ భారీ సదస్సు ఉపకరిస్తుందని వివరించారు.

ఆదివారం రోజంతా జరిగిన సాహిత్య సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, స్వర్ణ కిలారి లాంటి పలువురు ప్రముఖ రచయితలు, అమెరికా నుంచి పెద్దయెత్తున వచ్చిన ‘ఆటా’ ప్రతినిధులు జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, నరసింహ, సాయి సుధుని తదితరులు, వారి కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, ‘ఆటా-ఇండియా టీమ్’ సభ్యులను ప్రస్తుత ‘ఆటా’ బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు.
(చదవండి: తెలంగాణ వాసి అరుదైన ఘనత..యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు)


