న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్‌రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.
ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్‌గా పనిచేయనున్నారు.
కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.
అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.
అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది.


