ఏడుగురు ఎంపీలను కలిసిన ఎన్నారై అడ్వయిజరీ బృందం
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.
ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దు
బాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.
‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.

డిమాండ్లు
బిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలి
ఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.
ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.
ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.
24/7 హెల్ప్‌లైన్‌లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.
శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.
ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్‌లైన్ రిక్రూట్మెంట్‌పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.
విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.


