అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. మెస్సీ నామస్మరణతో మహానగరం శనివారం మారుమోగ్రిపోయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆద్యంతం చలాకీగా, సరదాగా గడిపిన మెస్సీ.. సరదా కిక్‌లతో ఫుట్‌బాల్‌ను స్టాండ్స్‌కు పంపించాడు. వాటిని అందుకుని అందుకున్న అభిమానులు ఇదేకదా అసలు ‘కిక్కు’ అంటూ మురిసిపోయారు.
కాగా మెస్సీ.. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సామాన్యులనూ ఆకర్షించిన అంశం.. వారిని ముక్కునవేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. ఈ లెజెండరీ ఆటగాడితో ఫొటో దిగాలంటే ఏకంగా పది లక్షలు చెల్లించాల్సి ఉండటం.
అయితే, మెస్సీ రేంజ్ గురించి తెలిసిన వాళ్లు మినమమ్ ఉంటది కదా! అని సరిపెట్టుకున్నారు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సీ సంపాదన.. 2025 నాటికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా!
ఫుట్‌బాల్‌కే ఆదరణ ఎక్కువ
భారత్‌తో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో ప్రఖ్యాతి పొందిన భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (దాదాపు రూ. 1400 కోట్లు), విరాట్ కోహ్లి (సుమారుగా వెయ్యి కోట్లు)లతో పోలిస్తే మెస్సీ సంపాదన చాలా ఎక్కువ. భారత్‌లో క్రికెట్ మతమైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కి ఆదరణ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం.

ఒక్కో మెట్టు ఎక్కుతూ..
పుట్టుకతోనే మెస్సీ కోటీశ్వరుడేమీ కాదు. చిన్ననాటి నుంచే ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువ.. ఆటలో అంకిత భావం, నైపుణ్యాలు అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. క్లబ్‌లకు ఆడుతూ పెద్ద మొత్తంలో ఆర్జించిన మెస్సీ.. ఇంటర్ మియామిలో చేరిన తొలి నాళ్లలో నెలకు మిలియన్ డాలర్లకు పైగా పొందాడు.
ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు 2.67 మిలియన్ డాలర్లుగా ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడు.

అంతేకాదు.. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తూ మెస్సీ దండిగా సంపాదన కూడబెట్టాడు. ఉదాహరణకు అడిడాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి రూ. 70 మిలియన్లకు పైగా ముట్టజెప్పుతున్నట్లు వివిధ వార్తా సంస్థలు నివేదించాయి.
రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలు
ఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఇక ఆట, ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టాడు. అంతేకాదు.. హోటల్ వ్యాపారాలనూ పెద్ద ఎత్తున విస్తరించాడు.

ఇలా అటు క్లబ్‌లు.. ఇటు ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ... నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. మెస్సీ నెల ఆదాయం సుమారుగా రూ. 41.67 కోట్లు. అంటే ఏడాదికి దాదాపుగా రూ. 500 కోట్లు అన్నమాట.
చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్


