ఆకిబ్ నబీ (PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి వారు హైలైట్ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్‌క్యాప్డ్ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.
ఆకిబ్ నబీ
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్‌బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం. తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.
ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.
ఈడెన్ ఆపిల్ టామ్
కేరళకు చెందిన తాజా బౌలింగ్ సంచలనం ఈడెన్ ఆపిల్ టామ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్. తాజా రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.
ఇక మొత్తంగా ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.
రాజ్ లింబాని
అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టులో రాజ్ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.
ఆకాశ్ మధ్వాల్
2023లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు ఆకాశ్ మధ్వాల్. ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్‌కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్ తరపున ఆరు మ్యాచ్‌లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.
అశోక్ శర్మ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్ శర్మ. ఇప్పటికి ఏడు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు నెట్‌బౌలర్‌గా పనిచేసిన అశోక్ శర్మ ఈసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు.


