జైస్వాల్- సర్ఫరాజ్ (ఫైల్ ఫొటోలు)
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సూపర్ లీగ్ మ్యాచ్‌లో ముంబై అదరగొట్టింది. హర్యానా విధించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. దేశీ టీ20 టోర్నమెంట్ సూపర్ లీగ్‌లోని గ్రూప్-బిలో భాగంగా పుణెలోని డీవై పాటిల్ అకాడమీలో ముంబై- హర్యానా జట్లు ఆదివారం తలపడ్డాయి.
234 పరుగులు
టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. హర్యానా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 234 పరుగులు స్కోరు చేసింది.
ఓపెనర్లలో కెప్టెన్ అంకిత్ కుమార్ (42 బంతుల్లో 89) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటగా.. వన్‌డౌన్ బ్యాటర్ నిశాంత్ సంధు (38 బంతుల్లో 63 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. మిగిలిన వారిలో సమంత్ జేఖర్ (14 బంతుల్లో 31 రిటైర్డ్ అవుట్), సుమిత్ కుమార్ (4 బంతుల్లో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్
ఇక హర్యానాకు ధీటుగా బదులిచ్చే క్రమంలో ముంబై ఓపెనర్, టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతక్కొట్టాడు. కేవలం యాభై బంతుల్లోనే ఏకంగా 16 ఫోర్లు, ఒక సిక్స్‌బాది 101 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే (10 బంతులల్లో 21) ఫర్వాలేదనిపించగా.. మూడో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అదరగొట్టాడు.
కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన సర్ఫరాజ్.. మొత్తంగా 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2026 వేలానికి ముందు ఈ మేరకు సత్తా చాటి.. తానూ రేసులోనే ఉన్నానంటూ ఫ్రాంఛైజీలకు మరోసారి సందేశం ఇచ్చాడు.
17.3 ఓవర్లలోనే
ఇక మిగిలిన ముంబై ఆటగాళ్లలో అంగ్‌క్రిష్ రఘువన్షీ (7), సూయాంశ్ షెడ్గే (13), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (2) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (3 బంతుల్లో 8), అథర్వ అంకోలేకర్ (2 బంతుల్లో 10) మెరుపులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
జైసూ, సర్ఫరాజ్ దంచికొట్టగా.. వీరిద్దరు ఆఖర్లో వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే హర్యానా విధించిన లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
చదవండి: IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాప్


