వైభవ్ సూర్యవంశీ (PC: X)
భారీ అంచనాల నడుమ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా గ్రూప్-‘ఎ’ లో ఉన్న భారత్- పాక్ (Ind vs Pak)మధ్య ఆదివారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.
ధనాధన్ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టిన ఆయుశ్
ఇక దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో దాయాదితో పోరులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో యూఏఈపై విఫలమైన ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) ఈసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆది నుంచే తడబడ్డాడు.
పాక్ బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన అలీ రెజా.. తొలి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి ఆయుశ్ మాత్రే పరుగు తీశాడు. ఇక రెండో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్‌లో ఆయుశ్ ఫోర్, సిక్స్, ఫోర్‌తో అలరించగా.. వైభవ్ మాత్రం ఇక్కడా ఖాతా తెరవలేదు.
టచ్‌లోకి వచ్చినట్లే వచ్చి
మూడో ఓవర్లో మళ్లీ రెజా రంగంలోకి దిగగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి వైభవ్ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. తర్వాత ఆయుశ్ రెజా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది సత్తా చాటాడు. అయితే, నాలుగో ఓవర్‌లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్‌లో రెండో బంతిని వైభవ్ స్ట్రెయిట్ షాట్ బాదగా.. అతడు బంతిని క్యాచ్ పట్టాడు.
దీంతో ఆరు బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ స్టార్ ఆరోన్ జార్జ్ క్రీజులోకి వచ్చాడు. కాగా ఆయుశ్ మాత్రే 25 బంతుల్లో 38 పరుగులు చేసి నిష్క్రమించగా.. విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) ఫెయిలయ్యారు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులే చేయగలిగింది.
కాగా యూఏఈతో గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ భారీ శతకం (171) బాదిన విషయం తెలిసిందే. అయితే, సెమీస్ చేరడంలో కీలకమైన పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు.
UPDATE: Asia Cup 2025: పాక్‌తో మ్యాచ్.. భారత్ స్కోరెంతంటే?
చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్


