రాణించిన మిలింద్, తనయ్, తన్మయ్, రాహుల్
పుణే: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ‘సూపర్ లీగ్’ దశలో హైదరాబాద్ జట్టు రెండో విజయంతో ఫైనల్‌కు చేరువైంది. రాజస్తాన్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో సీవీ మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది.
మహిపాల్ లొమ్రోర్ (35 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (2/23), సీవీ మిలింద్ (3/25), తనయ్ త్యాగరాజన్ (3/38) రాణించారు. అనంతరం హైదరాబాద్ జట్టు ధాటిగా ఆడుతూ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయం సాధించింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తన్మయ్ అగర్వాల్ (41 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్ బుద్ధి (36 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాజస్తాన్ బౌలర్ల భరతం పట్టి అర్ధ సెంచరీలతో మెరిపించారు. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ప్రస్తుతం హైదరాబాద్ 8 పాయింట్లతోపాటు 2.999 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది.
హరియాణా (4 పాయింట్లు; 0.234 రన్‌రేట్), ముంబై (4 పాయింట్లు; –0.371 రన్‌రేట్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో హరియాణాతో హైదరాబాద్; రాజస్తాన్‌తో ముంబై తలపడతాయి.


