ఫుట్‌బాల్ రారాజు లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి అంకానికి చేరుకుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశ రాజధానిలో ఇవాళ ఈ స్టార్ ప్లేయర్ పర్యటించబోతున్నారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న వేళ.. ఈ పర్యటనపై నెట్టింట జోకులు పేలుతున్నాయి.
ఢిల్లీ పొల్యూషన్ గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. విద్యాసంస్థలకు, ఆఫీసులకు ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది అక్కడి అధికార యంత్రాంగం. ఈ తీవ్ర వాయుకాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. చాలా చోట్ల జీరో విజిబిలిటీతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్య అర్జెంటీనా ఫుట్‌బాల్ వీరుడు రావడంపై జోకులు ఇలా ఉన్నాయి..
🤧మెస్సీ బాయ్.. ఢిల్లీకి మీకు స్వాగతం. మీ ఎడమ కాలిని 900 మిలియన్ డాలర్లకు((దాదాపు ₹7,500 కోట్లకు పైగా) ఇన్సూరెన్స్ చేయించారని విన్నా. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఇన్సురెన్స్ చేయించారా?
😬విరాట్ కోహ్లి.. మెస్సీ.. ఇది గోట్‌లు కలిసి చేయబోయే సందడి కోసం ఢిల్లీ ఎదురు చూస్తోంది. కానీ, ఆ దృశ్యం ఇలా ఉండొచ్చు.. అంటూ మసకగా ఉన్న ఇద్దరి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు
Fans are waiting to see Virat Kohli and Leo Messi together in Delhi.
Meanwhile, this is how the photo would probably look in Delhi air. 😭 pic.twitter.com/xvln8edSu8— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025
😓మెస్సీ తన కెరీర్‌లో ఇప్పటిదాకా 896 గోల్స్ చేశారు.. ఇప్పుడు ఢిల్లీ ఏక్యూఐ(వాయు నాణ్యత) ఆ రికార్డును బద్ధలు కొడుతుందేమో!
😎మెస్సీకి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఈ ఒక్కరోజే ఆయన 20 సిగరెట్లు తాగుతారేమో!.. అంటూ ఢిల్లీ పొల్యూషన్‌ను అన్వయించి సెటైర్లు వేస్తున్నారు.
కోల్‌కతా మినహాయించి హైదరాబాద్, ముంబైలో మెస్సీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఫుట్‌బాల్ అభిమానుల కోలాహలం నడుమ స్టేడియంలో మెస్సీ సందడి చేశాడు. ఇక్కడి అభిమానానికి ముగ్దుడైనట్లు ప్రకటించాడు. నేటితో ఈ టూర్ ముగియనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ ఈవెంట్‌కు ప్రధాని మోదీ సైతం హాజర కావొచ్చనే ప్రచారం వినిపించినప్పటికీ.. విదేశీ పర్యటనల నేపథ్యంలో అది జరగకపోవచ్చనే తెలుస్తోంది.
లియోనెల్ మెస్సీ ఎడమ కాలికి సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఎడమ కాలే ఆటలో ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తారు. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని పరిస్థితి వస్తే.. క్లబ్‌లు, స్పాన్సర్లకు ఆర్థిక రక్షణ లభించేందుకు ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించారు.
అసలు ఈ భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ 2025లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు అనుమతి ఉన్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ (Inter Miami) తరఫున మాత్రమే పూర్తి మ్యాచ్‌లు ఆడటానికి. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి.
మెస్సీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర క్రీడాకారులకు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్లకు, డేవిడ్ బెక్‌హమ్ తన ముఖానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే.. మెస్సీ ఎడమ కాలు ఇన్సూరెన్స్ విలువ ప్రపంచంలోనే అత్యధికంగా భావించబడుతోంది.


