టీమిండియా టీ20 స్టార్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ ఛేదనలో అత్యుత్తమ సగటుతో పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇన్నాళ్లుగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును తిలక్ బద్దలు కొట్టాడు.
తొలి రెండు టీ20లలో అలా
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు తిలక్ వర్మ (Tilak Varma). బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పుల నేపథ్యంలో కటక్ వేదికగా తొలి టీ20లో నాలుగో స్థానంలో వచ్చిన ఈ హైదరాబాదీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.
ఇక ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లోనూ ఇదే స్థానంలో ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఈసారి మాత్రం దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు తిలక్. అయితే, ఈ మ్యాచ్‌లో అతడి పోరాటం వృథాగా పోయింది.
అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్
తాజాగా ఆదివారం నాటి మూడో టీ20లో మాత్రం తిలక్ తనదైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ధర్మశాలలో మూడో టీ20లో సౌతాఫ్రికా విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనను టీమిండియా 15.5 ఓవర్లలోనే పూర్తి చేసింది.
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 లక్ష్య ఛేదనలో.. కనీసం 500 పరుగులు సాధించిన ఆటగాళ్ల (టెస్టు హోదా కలిగిన దేశాలు) జాబితాలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో లక్ష్య ఛేదనలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్లు (కనీసం 500 పరుగులు)
🏏తిలక్ వర్మ (ఇండియా)- 68.0 సగటుతో
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 67.1 సగటుతో
🏏ఎంఎస్ ధోని (ఇండియా)- 47.71 సగటుతో
🏏జేపీ డుమిని (సౌతాఫ్రికా)- 45.55 సగటుతో
🏏సంగక్కర (శ్రీలంక)- 44.93 సగటుతో.


