ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన పేసర్ గస్ అట్కిన్సన్‌ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో కుడిచేతి వాటం పేసర్‌నే ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.
2-0తో ఆధిక్యంలో ఆసీస్
కాగా ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య ఆసీస్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు స్టోక్స్ బృందం అక్కడికి వెళ్లింది. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ప్రస్తుతానికి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇలా కంగారూలు సొంతగడ్డపై ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ముఖ్యంగా కీలక పేసర్ అయిన గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ధారాళంగా పరుగులు (సగటున 78.6) ఇచ్చుకుంటూ.. అదే స్థాయిలో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో.. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు కేవలం మూడే వికెట్లు పడగొట్టాడు.
అతడిపై వేటు
ఈ నేపథ్యంలో అట్కిన్సన్‌పై వేటు వేసిన ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం.. అతడి స్థానంలో మరో రైటార్మ్ పేసర్ జోష్ టంగ్ (Josh Tongue)ను తుదిజట్టుకు ఎంపిక చేసింది. దీంతో మాథ్యూ పాట్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఈ ఒక్క మార్పు తప్ప రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.
బషీర్‌కు మరోసారి మొండిచేయి
మరోవైపు.. స్పెషలిస్టు స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు మరోసారి మొండిచేయి చూపిన మేనేజ్‌మెంట్.. స్పిన్ ఆప్షన్ కోటాలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను కొనసాగించింది.
ఇదిలా ఉంటే.. ఓవైపు ఆసీస్ పేసర్లు విజృంభిస్తున్న పిచ్‌లపై ఇంగ్లండ్ సీమర్లు మాత్రం తేలిపోతున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (డిసెంబరు 17) నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్ మైదానం వేదిక.
ఆస్ట్రేలియాతో యాషెస్ మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.
చదవండి: అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్


