ప్యాట్ కమిన్స్ (PC: CA)
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును బుధవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌తో తిరిగి ఆసీస్ టీమ్‌తో చేరినట్లు వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఈ ఒక్క మార్పు (కమిన్స్ చేరిక) జరిగినట్లు తెలిపింది.
2-0తో ఆధిక్యంలో ఆసీస్
కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో దుమ్ములేపుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన కంగారూలు.. రెండో టెస్టులోనూ విజయం సాధించారు. బ్రిస్బేన్ వేదికగా పింక్ బాల్‌తో (డే- నైట్ మ్యాచ్) జరిగిన ఈ మ్యాచ్‌లోనూ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేశారు.
అదరగొట్టారు
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (83 బంతుల్లో 123)తో ఓపెనర్‌గా వచ్చిన ట్రవిస్ హెడ్ (Travis Head) ఇరగదీశాడు. ఇక రెండో టెస్టులోనూ స్టార్క్ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
ఆ ఇద్దరూ దూరం
ఇదిలా ఉంటే.. ఆసీస్ పేసర్ జోష్ హాజల్‌వుడ్ (Josh Hazlewood)... ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ‘యాషెస్’ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. కండరాల గాయంతో ఇప్పటికే జరిగిన రెండు టెస్టులకు దూరమైన హాజల్‌వుడ్ మిగిలిన మూడు మ్యాచ్‌లకు సైతం అందుబాటులో ఉండబోడని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ మెక్‌డొనాల్డ్ మంగళవారం వెల్లడించాడు.
వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్‌కు హాజల్‌వుడ్ దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి అంతా టీ20 వరల్డ్‌కప్ పైనే’ అని మెక్‌డొనాల్డ్ అన్నాడు.
డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగా
మరోవైపు.. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లూ ఆడని రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్... డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు సారథిగా వ్యవహరించగా... కమిన్స్ రాకతో అతడు కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు.
గత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేయగా... ఇప్పుడు కమిన్స్ రాకతో కంగారూల పేస్ బలం మరింత పేరగనుంది. ఇక ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన వుడ్... మిగిలిన మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు


