ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌లో ఆ్రస్టేలియా జట్టు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి 2–0తో ముందంజ వేసింది. ‘డే అండ్ నైట్’ టెస్టుల్లో తమ ఆధిపత్యం కొనసాగించిన కంగారూలు... ప్రఖ్యాత ‘గాబా’ స్టేడియంలో ఇంగ్లండ్‌కు అటు బ్యాట్‌తో, ఇటు నోటితో గట్టిగా బదులిచ్చారు.
ఇంగ్లండ్ నిర్దేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఆసీస్ అలవోకగా 69 పరుగులు చేసి గెలిచింది.

గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ ఆసీస్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసిన ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్‌ను స్మిత్ బ్యాట్‌తో బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో స్మిత్ ‘గాబా’లో వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ట్రావిస్ హెడ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 134/6తో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 75.2 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ ముందు ఇంగ్లండ్ కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచిగల్గింది.
ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ స్పందించాడు. తమ జట్టు మరింత నిలకడగా ఆడాల్సిన అవసరం ఉందని అతడి తెలిపాడు.

మా ఓటమికి కారణమిదే?
"చాలా బాధగా ఉంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాము. కీలక సమయంలో మేము ఒత్తడిని తట్టుకోలేకపోవడం వల్లే ఓడిపోయాము. తొలి టెస్టులో కూడా మేము ప్రత్యర్ధిపై పట్టు సాధించాము. కానీ చిన్న చిన్న తప్పిదాల వల్ల పెర్త్ టెస్టును కోల్పోయాము.
ఇప్పుడు గబ్బాలో కూడా అదే తప్పు చేశాము. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికి ఓడిపోతుండడం మాకు చాలా చాలా బాధపడుతున్నాము. మా ఆటగాళ్లు మానసికంగా మరింత సిద్దంగా కావాలి. ఆస్ట్రేలియా వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముంది.
క్లిష్ట సమయాల్లో మరింత పోరాట పటిమను చూపించాలి. ఆస్ట్రేలియాకు మేము ధీటైన సమాధానమిస్తాము. మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం 2-0 తో వెనకబడి ఉన్నాము. కానీ మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము.
ఆస్ట్రేలియా గడ్డపై ఆడేందుకు బలహీనులకు చోటు లేదని అందరూ అంటుంటారు. కచ్చితంగా మాది బలహీనమైన జట్టు కాదని నిరూపించుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.
చదవండి: ‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...


