సాక్షి, విశాఖపట్నం: టెస్టుల్లో పోగుట్టుకున్న సిరీస్ తాలూకు ప్రతిష్టను భారత్ వెంటనే విశాఖ తీరంలో వన్డే సిరీస్‌తో నిలబెట్టుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో విన్నర్స్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చిన ఆటగాళ్లంతా హోటల్‌కు చేరాక కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేక్ కోసి ‘కింగ్’ కోహ్లి నోటిని తీపి చేశాడు. తర్వాత అక్కడే ఉన్న ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకూ కేక్ ముక్కను తినిపించబోయాడు.
వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా రోహిత్ ‘ప్లీజ్... నాకొద్దు. దీన్ని తింటే తిరిగి లావెక్కిపోతా’నంటూ జైస్వాల్ ప్రయత్నాన్ని వారించాడు. దీంతో అక్కడున్న సహచరులంతా పెద్దగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లెక్కలేనన్ని లైక్స్, రీట్వీట్స్‌తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. కేక్ చిన్న ముక్కే అయినా రోహిత్ కఠినమైన డైట్‌కు ఇబ్బంది కలగొచ్చనే బెంగతోనే ‘హిట్‌మ్యాన్’ సున్నితంగా తిరస్కరించాడు.
కోహ్లిలాగే కేవలం వన్డేలకే పరిమితమైన ఈ స్టార్ ఓపెనర్, మాజీ విజయవంతమైన కెప్టెన్ గత కొంతకాలంగా ఫిట్‌నెస్‌పైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. వన్డే వరల్డ్‌కప్ (2027)కు దాదాపు ఏడాదిన్నర ఉండటంతో నోటిని డైట్ క్రమశిక్షణతో కట్టిపడేశాడు. దీనివల్లే అతను ఏకంగా 11 కిలోల బరువుతగ్గాడు.
ఇంట్లో నోటిని అదుపులో పెట్టుకున్న ఈ దిగ్గజ బ్యాటర్ క్రీజులో మాత్రం బ్యాట్‌కు పనిచెబుతున్నాడు. ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా భారీషాట్లతో చెలరేగిపోతున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ రోహిత్ రెండు అర్ధసెంచరీలను సాధించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది. సిరీస్ కైవసం చేసుకుంది.


