దక్షిణాఫ్రికాకు చెందిన భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను నమీబియా పురుషుల క్రికెట్ జట్టు సలహాదారుగా నియమించుకుంది. హెడ్ కోచ్ క్రెయిగ్ విలియమ్స్‌తో కలిసి నమీబియా జట్టు కోసం ఆయన పనిచేయనున్నారు. త్వరలోనే జరిగే టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్టు కుదిరినట్లు నబీబియా క్రికెట్ బోర్డు వెల్లడించింది.
‘నమీబియాలాంటి నిబద్ధత గల జట్టుతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కొంతకాలంగా నమీబియా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. నాకున్న కోచింగ్ అనుభవంతో ఆ జట్టు మరింత రాటుదేలేందుకు, వచ్చే ప్రపంచకప్‌లో రాణించేందుకు కృషి చేస్తాను’ అని కిర్‌స్టెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ సఫారీ మాజీ ఓపెనర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యారు. 2007లో భారత హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్‌లోనే ధోని సేన 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి, రెండోసారి (1983 తర్వాత) విశ్వవిజేతగా నిలిచింది.
తదనంతరం దక్షిణాఫ్రికా సహా పలు జాతీయ జట్లకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. ఐపీఎల్ సహా విశ్వవ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌ల్లోనూ పలు ఫ్రాంచైజీలకు కోచ్‌గా, మెంటార్‌గా కిర్‌స్టెన్ పనిచేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలలో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా టి20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.
చదవండి: ‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...


