ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఓ యువ సంచలనం అద్భుత ప్రదర్శలనతో అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీపై అతడు ఇన్నింగ్స్ అభిమానులను, టాలెంట్ స్కౌట్స్‌ను సైతం ఆశ్చర్యపరిచింది.
ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా అతడిది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశవాళీ క్రికెట్‌లో నయా ఫినిషర్‌గా పేరు గాంచాడు. అతడే రాజస్తాన్ పవర్ హిట్టర్ 21 ఏళ్ల ముకుల్ చౌదరి.
ఢిల్లీపై అద్బుతం.. ఎవరీ ముకుల్ చౌదరి?
రాజస్తాన్‌లోని ఝుంఝునుకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఫస్ట్ క్లాస్, సీనియర్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఇప్పటివరకు పెద్దగా ఆడకపోయినప్పటికి.. అండర్-23 టోర్నీల్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.
తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఢిల్లీపై విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 176 పరుగుల లక్ష్య చేధనలో రాజస్తాన్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయం అని భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ముకల్ అద్భుతం చేశాడు.
ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగి తన జట్టును ఒంటి చేత్తే గెలిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 1 ఫోర్లు, 7 సిక్స్‌లతో 62 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముకుల్ 2023లో రాజస్తాన్ సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. కానీ అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు ఇప్పటివరకు మూడేసి చొప్పున ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
లీడింగ్ రన్ స్కోరర్‌గా..
ముకుల్ ఇటీవల ముగిసిన అండర్ 23 వన్డే టోర్నమెంట్‌లో రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.
అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 147గా ఉంది. అదేవిధంగా టోర్నమెంట్‌లో అత్యధికంగా 34 సిక్సర్లు బాదాడు. ఈ ప్రదర్శనలతో సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని అతడు ఆకర్షించాడు. దీంతో దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆడే అవకాశం చౌదరికి లభించింది.
ఈసారి మాత్రం తన వచ్చిన అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నాడు. పేస్, స్పిన్ రెండింటినీ అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అంతేకాకుండా అతడి షాట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది.
ముంబై కన్ను..
కాగా ఈ యువ సంచలనంపై ముంబై ఇండియన్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. నవంబర్ ఆఖరి వారంలో అతడు ముంబై నిర్వహించిన ట్రయల్స్‌కు హాజరైనట్లు సమాచారం. రియాన్ రికెల్టన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ముకుల్‌ను తీసుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు టాలెంట్ స్కౌట్స్ కూడా అతడి బ్యాటింగ్ వీడియోలను పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.
చదవండి: చాలా చాలా బాధగా ఉంది.. మా సత్తా ఏంటో చూపిస్తాం: స్టోక్స్


