సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మంగళవారం మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత బౌలింగ్‌లో 3 వికెట్లతో సత్తాచాటిన అర్జున్.. అనంతరం బ్యాటింగ్‌లో 16 పరుగులు చేశాడు.
అర్జున్ పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మధ్యప్రదేశ్ ఓపెనర్లు అంకుష్ సింగ్, శివాంగ్ కుమార్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్‌ను అద్భుతమైన బంతితో జూనియర్ టెండూల్కర్ బోల్తా కొట్టించాడు.
బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అర్జున్ దూకుడుగా ఆడి గోవాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతడిని గోవా టీమ్ మెనెజ్‌మెంట్ ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. కానీ బౌలింగ్‌లో రాణిస్తున్న అర్జున్.. బ్యాటింగ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.
లక్నోలోకి అర్జున్
కాగా అర్జున్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. రాబోయో ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్‌ను లక్నో ట్రేడ్ చేసుకుంది.
అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో వున్నప్పటికి.. 2023 సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. జట్టులో బుమ్రా, బౌల్ట్ వంటి బౌలర్లు ఉండడంతో అర్జున్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇప్పుడు లక్నో తరపున అర్జున్‌కు ఎక్కువగా ఛాన్స్ లభించే సూచనలు కన్పిస్తున్నాయి.
గోవా ఘన విజయం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్‌పై గోవా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎంపీ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని గోవా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.కెప్టెన్ సుయాష్ ప్రభుదేశాయ్(50 బంతుల్లో 75) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు అభినవ్ 55 పరుగులతో రాణించాడు.
చదవండి: సర్ఫరాజ్ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో


