2026 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది. ట్రేడింగ్, రిటెన్షన్ల ప్రక్రియ ముగియగానే ఫ్రాంచైజీలకు వేలం ఫీవర్ పట్టుకుంది. ఈసారి వేలంలో రికార్డు స్థాయిలో 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని క్రిక్‌బజ్ నివేదిక తెలిపింది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఎంతిచ్చి సొంతం చేసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరుగనుంది.
15 దేశాల ఆటగాళ్లు
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈసారి వేలంలో భారత్ సహా 15 దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఎస్‌ఏతో పాటు మలేషియా లాంటి దేశం నుంచి ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బరిలో హేమాహేమీలు
ఈసారి వేలం బరిలో హేమాహేమీలు ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ నుంచి పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్.. ఆస్ట్రేలియా నుంచి కెమెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ కర్రన్.. శ్రీలంక నుంచి వనిందు హసరంగ, మతీష పతిరణ.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర.. బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్-ఉల్-హక్.. సౌతాఫ్రికా నుంచి గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే తదితరులు పాల్గొంటున్నారు.
వెంకటేష్ అయ్యర్ మరోసారి జాక్‌పాట్ కొడతాడా..?
గత సీజన్ వేలంలో భారత ఆటగాడు వెంకటేష్ అయ్యర్ రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకొని జాక్‌పాట్ కొట్టాడు. భారీ అంచనాలతో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. అయితే వెంకటేష్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్ అతన్ని వదిలించుకుంది.
దీంతో ఈసారి అతను వేలం బరిలో నిలిచాడు. గత సీజన్‌లా కాకపోయినా ఈసారి కూడా వెంకటేష్‌కు భారీ మొత్తమే లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అతను అత్యధిక బేస్‌ప్రైజ్ అయిన 2 కోట్ల విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. భారత్ నుంచి వెంకటేష్‌తో పాటు రవి బిష్ణోయ్ మాత్రమే ఈ విభాగంలో పోటీపడుతున్నాడు.
2 కోట్ల బేస్‌ప్రైజ్ విభాగంలో ఎవరెవరు..?
2 కోట్ల బేస్‌ప్రైజ్ విభాగంలో ఈసారి మొత్తం 45 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, కెమరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్, ముస్తాఫిజుర్ రహ్మాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డానియల్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, పతిరణ, తీక్షణ, హసరంగ, షాయ్ హోప్, అల్జరీ జోసఫ్ తదితరులు ఈ విభాగంలో తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు.
భారత్ నుంచి ఎవరెవరు..?
ఈసారి వేలంలో భారత్ నుంచి మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్ మరియు ఉమేశ్ యాదవ్ పాల్గొంటున్నారు.
మలేషియా నుంచి కూడా..?
ఈసారి వేలంలో మలేషియా నుంచి ఒకరు తమ పేరును నమోదు చేసుకున్నారు. భారత మూలాలున్న ఆల్‌రౌండర్ విరన్‌దీప్ సింగ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
కోటి విభాగంలో షకీబ్
బంగ్లాదేశ్ వెటరన్, 9 ఐపీఎల్ సీజన్లు ఆడిన అనుభవమున్న షకీబ్ ఉల్ హసన్ ఈసారి రూ. కోటి బేస్‌ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.
77 స్లాట్ల కోసం పోటీ
77 స్లాట్లు..ఇందులో 31 విదేశీ స్లాట్ల కోసం 1355 మంది ఆటగాళ్లు పోటీపడునున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి.


