T20 WC 2026: తిరగబడ్డ పాక్‌ క్రికెటర్లు!.. ఇక.. | Pakistan Players Revolt Against Coach Mike Hesson After T20 WC Debacle, Accusing Him Of Taking Unilateral Decisions | Sakshi
Sakshi News home page

T20 WC 2026: తిరగబడ్డ పాక్‌ క్రికెటర్లు!.. ఇక..

Mar 4 2026 5:30 PM | Updated on Mar 4 2026 5:54 PM

Pakistan Players Revolt Against Coach Hesson After T20 WC Debacle

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తోంది పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు. గ్రూప్‌ దశలో అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియా వంటి చిన్న జట్లపై గెలుపొందిన సల్మాన్‌ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది.

పాకిస్తాన్‌కు భంగపాటు
ఇక సూపర్‌-8 దశలోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైపోగా.. తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై భారీ విజయం సాధించాల్సి ఉండగా.. లంక గట్టి పోరాటం చేయడంతో పాకిస్తాన్‌కు భంగపాటు తప్పలేదు.

లంకపై గెలిచినా న్యూజిలాండ్‌తో పోటీలో నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి సెమీస్‌ చేరకుండానే పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో విఫలమైన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

భారీ జరిమానా
ఏకంగా 50 లక్షల రూపాయలు (పాక్‌ కరెన్సీలో) జరిమానా విధించాలని పీసీబీ నిర్ణయించినట్లు స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు పడనుందనే వార్తలూ ఊపందుకున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో.. హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌కు వ్యతిరేకంగా పాక్‌ ఆటగాళ్లు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. కోచ్‌ ఏకపక్ష నిర్ణయాల కారణంగా డ్రెసింగ్‌ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఇప్పటికే పీసీబీ అధికారులకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

తిరగబడ్డ పాక్‌ క్రికెటర్లు!.. ఇక వేటే!
జియో సూపర్‌ కథనం ప్రకారం.. ‘‘టోర్నమెంట్‌ జరుగుతున్న సమయంలోనే చాలా మంది పాకిస్తాన్‌ ప్లేయర్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులను కలసి కోచ్‌ గురించి ఫిర్యాదు చేశారు. కీలక విషయాలను సైతం కెప్టెన్‌తో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్న తీరును వారి దృష్టికి తీసుకువచ్చారు.

సొంత నిర్ణయాలతో యాజమాన్యం విషయాల్లోనూ హసన్‌ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరును వివరించారు. ఇందుకు సీనియర్‌ అధికారులు సానుకూలంగా స్పందించి.. సమీక్ష జరుపుతున్నారు. 

కోచ్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, హసన్‌కు రెండేళ్ల కాంట్రాక్టు ఉంది. కాబట్టి ఇప్పట్లో అతడిని తొలగించే ప్రయత్నం జరగకపోవచ్చు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

Advertisement
 
Advertisement
Advertisement