ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Mini Auction) ఈనెల (డిసెంబర్) 16న అబుదాబీలో జరుగనున్న విషయం తెలిసిందే. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ఈసారి వేలంలో 15 దేశాలకు చెందిన 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 77 స్లాట్లు.. ఇందులో 31 విదేశీ స్లాట్ల కోసం ఈ ఆటగాళ్ల మధ్య పోటీ జరుగుతుంది. ఈసారి వేలం బరిలో హేమాహేమీలు ఉన్నట్లు తెలుస్తుంది.
భారత్ నుంచి పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్.. ఆస్ట్రేలియా నుంచి కెమెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ కర్రన్.. శ్రీలంక నుంచి వనిందు హసరంగ, మతీష పతిరణ.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర.. బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్-ఉల్-హక్.. సౌతాఫ్రికా నుంచి గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే తదితరులు పాల్గొంటున్నారు.
వీరిలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఎంతిచ్చి సొంతం చేసుకుంటుందన్న అంశంపై క్రికెట్ ప్రపంచమంతా చర్చించుకుంటుంది. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా, ఫ్రాంచైజీల అవసరాల దృష్ట్యా ఓ విషయమైతే స్పష్టమవుతుంది. ఈసారి వేలంలో ఇంగ్లండ్ డాషింగ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (Jamie Smith) జాక్‌పాట్ కొట్టవచ్చు.

అదెలా అంటే.. వేలంలో అత్యధిక పర్స్ నిలువ ఉన్న కేకేఆర్కు వికెట్‌కీపర్ బ్యాటర్ అవసరం. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ ఇటీవలే రహ్మానుల్లా గుర్బాజ్, క్వింటన్ డికాక్‌లను వదిలేసింది. దీంతో కేకేఆర్ జేమీ స్మిత్ కోసం ఎంతైనా ఖర్చు చేయవచ్చు. వారి వద్ద 64.30 కోట్లు ఉన్నాయి. ఇందులో జేమీ కోసం సగం వెచ్చించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రెండోది.. వేలంలో రెండో అత్యధిక పర్స్ నిల్వ ఉన్న సీఎస్కేకు బ్యాకప్ ఓవర్సీస్ ఓపెనర్ అవసరం. జేమీ ఓపెనర్గా మెరుపులు మెరిపించగల సమర్దుడు. దేశవాలీ పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ఓపెనర్గా సక్సెస్ అయ్యాడు.
జేమీ కోసం పోటీపడే ఆస్కారమున్న మరో ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఫ్రాంచైజీకి విదేశీ ఓపెనింగ్ బ్యాటర్ అవసరముంది.
జేమీ కోసం పోటీపడే ఛాన్స్ ఉన్న నాలుగో ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్. పంజాబ్ ఇటీవలే వికెట్‌కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్‌ను వదిలేసుకుంది. దీంతో అతని ప్రత్యామ్నాయంగా జేమీ కోసం పోటీపడవచ్చు.
ఈ అవసరాల దృష్ట్యా త్వరలో జరుగనున్న ఐపీఎల్ మినీ వేలంలో జేమీ స్మిత్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు.


