మేజర్ లీగ్ సాకర్ టైటిల్ నెగ్గిన ఇంటర్ మయామి క్లబ్
ఫ్లోరిడా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనెల్ మెస్సీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్‌ఎస్) కప్‌లో మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్ మయామి జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తుదిపోరులో ఇంటర్ మయామి క్లబ్ 3–1 గోల్స్ తేడాతో వాంకోవర్ క్లబ్‌పై విజయం సాధించింది. ఇంటర్ మయామి జట్టు తరఫున మెస్సీ అన్నీ తానై వ్యవహరించాడు. ఫైనల్లో ఈ స్టార్ ఆటగాడు గోల్ చేయలేకపోయినా... సహచరులు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో వాంకోవర్ జట్టు ఆటగాడు ఎడైర్ ఒకాంపో ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో మయామి జట్టు ముందంజ వేయగా... ఆ తర్వాత రోడ్రిగో డె పాల్ (71వ నిమిషంలో), టాడియో అల్లెండె (90+6వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. వాంకోవర్ జట్టు తరఫున అలీ అహ్మద్ (60వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఈ సీజన్‌లో మెస్సీకిది మూడో మేజర్ లీగ్ టైటిల్ కాగా... ఓవరాల్‌గా కెరీర్‌లో 47వది.
‘మూడేళ్ల క్రితం ఎంఎల్‌ఎస్ టైటిల్ గెవాలని కలగన్నా... అది ఈ రోజు సాధ్యమైంది. సీజన్ ఆసాంతం జట్టు మొత్తం కలిసికట్టుగా ఆడింది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆటగాళ్లందరూ దీనికి అర్హులు’ అని మెస్సీ పేర్కొన్నాడు. ఇంటర్ మయామి క్లబ్‌కు ఇదే తొలి ఎంఎల్‌ఎస్ టైటిల్ కాగా... మెస్సీకి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కింది.
జర్మనీ దిగ్గజ ఆటగాడు థామస్ ముల్లర్ వాంకోవర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... చాన్నాళ్ల తర్వాత ముల్లర్‌పై మెస్సీ ఆధిపత్యం కనబర్చగలిగాడు. గతంలో పలుమార్లు ముల్లర్ కారణంగా అర్జెంటీనా జట్టు ప్రధాన టోర్నీల్లోపరాజయం పాలైంది. 2010 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్, 2014 వరల్డ్‌కప్ ఫైనల్లో ముల్లర్ సారథ్యంలోని జర్మనీ జట్టు... అర్జెంటీనాపై విజయం సాధించింది. ఇలా ఇప్పటి వరకు పలు కీలక టోర్నీల్లో మెస్సీపై ముల్లర్‌దే ఆధిపత్యం కాగా... ఎట్టకేలకు ఎంఎల్‌ఎస్ కప్‌లో మెస్సీ బదులు తీర్చుకున్నాడు.


