సాక్షి హైదరాబాద్:న్యూఇయర్ వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈగల్ టీం తన డ్రగ్స్ వినియోగంపై నిఘాను ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసింది. ఈసందర్భంగా కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో 8మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆపబ్‌కు నోటీసులు జారీ చేసింది. పబ్‌లలో మాదకద్రవ్యాలు వాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేసింది.
ఈ డ్రగ్స్ దాడులలో మెుత్తం 14 మందికి ర్యాపిడ్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించగా వారిలో 8మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరో 8మంది పరీక్షలు నిర్వహించే కంటే ముందే తామే డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పరీక్షలో నిందితులు కొకైన్, గంజాయి, OPM, THC వినియోగించినట్లు తేలిందని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 6 ఎన్డీపీ బాటిళ్లు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడం కోసం "ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ (EAGLE) ను ఏర్పాటు చేసింది. ఈ విభాగం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) సమక్షంలో పనిచేస్తుంది. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వాడకం నిరోధించడంలో ఈ విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది.


