యువ ఆటగాళ్లు కూడా అద్భుతం
పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణాపై ప్రశంసలు
వన్డేల్లో ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉండాలి
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో విజయం సాధించడంలో సీనియర్‌లతో పాటు... యువ ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
టి20, టెస్టు ఫార్మాట్‌ల నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ , ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లి ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకోగా... రోహిత్ శర్మ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు.
గంభీర్‌కు సీనియర్ ఆటగాళ్లకు మధ్య సయోధ్య కుదరడం లేదనే వార్తల నేపథ్యంలో... సిరీస్ విజయం అనంతరం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో రోహిత్, కోహ్లి ప్రాధాన్యత... పేస్ ఆల్‌రౌండర్‌గా హర్షిత్ రాణా రాణించడం... వాషింగ్టన్ సుందర్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వడం వంటి వివరాలు అతడి మాటల్లోనే...
» కోహ్లి, రోహిత్ నాణ్యమైన ప్లేయర్లు. వాళ్లు ప్రపంచశ్రేణి ఆటగాళ్లు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఇలాంటి అనుభజు్ఞలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటంతో జట్టుకు ఎంతో మేలు చేస్తుంది.
» వాళ్లు చక్కగా ఆడుతున్నారు. సుదీర్ఘకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. 50 ఓవర్ల ఫార్మాట్‌లో వాళ్లిద్దరూ చాలా ముఖ్యం.
» పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉంటే... జట్టు ఎంపికలో వెసులుబాటు ఉంటుంది. అందుకే హర్షిత్ రాణా వంటి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఎనిమిదో స్థానంలో బ్యాట్‌తో పరుగులు చేయగల ప్లేయర్ ఉంటే ఏ జట్టుకైనా మేలే కదా. అలాంటి ఆటగాడు జట్టులో సమతూకాన్ని తీసుకువస్తాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ముగ్గురు ప్రధాన పేసర్లు జట్టులో ఉండటం తప్పనిసరి. రాణా పేస్ ఆల్‌రౌండర్‌గా మరింత పరిణతి సాధిస్తే అది టీమ్‌కు బాగా ఉపయోగ పడుతుంది. ఆ దిశగా అతడిని ప్రోత్సహిస్తున్నాం.
» బుమ్రా అందుబాటులో లేకున్నా... అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈ ముగ్గురికి వన్డే క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేకపోయినా... వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకొని చక్కటి ఫలితాలు రాబట్టారు.
» వన్డే క్రికెట్‌లో స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలని నేను అనుకోవడం లేదు. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లంతా సిద్ధంగా ఉండటం మేలు. టెస్టు క్రికెట్‌లో అయితే ప్రతి స్థానానికి ప్రత్యేకమైన ఆటగాళ్లు ఉండటం మంచిది, కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనింగ్ జోడీ మినహా తక్కిన స్థానాలకు ఆ అవసరం లేదు.
» వాషింగ్టన్ సుందర్‌నే తీసుకుంటే అతడు ఏ స్థానంలోనైనా చక్కగా ఒదిగిపోగలడు. విదేశాల్లో చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో స్థానంలో, ఐదో స్థానంలో, ఎనిమిదో స్థానంలో ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ బ్యాటింగ్ చేసేందుకు చిరునవ్వుతో సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ఎంతో బాగుంటుంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది.
» ఇటీవలి కాలంలో మ్యాచ్ ఫలితాలను నిర్ణయించడంలో టాస్ కీలకం అవుతోంది. మొదట బౌలింగ్ చేయడంలో, ఆ తర్వాత బౌలింగ్ చేయడంలో చాలా తేడా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మన బౌలర్లకు బంతిపై సరిగ్గా పట్టు చిక్కలేదు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మన బ్యాటర్ల ప్రతాపం అందరూ చూశారు.
» వన్డే సిరీస్ ఫలితాలపై మంచు ప్రభావం చూపింది కానీ... టి20 సిరీస్‌కు ఆ ఇబ్బంది ఉండదు. రెండు ఇన్నింగ్స్‌లు సాయంత్రం తర్వాతే ప్రారంభమవుతాయి కాబట్టి ఇద్దరికీ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి.


