వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు (Men's T20 World Cup 2026) సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్ వేదికలు ఖరారయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫైనల్ వేదిక విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.
20 దేశాలు పాల్గొనే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌లోని ఐదు నగరాలు (ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా), శ్రీలంకలోని మూడు మైదానాల్లో (కొలొంబోలో 2, క్యాండీలో ఓ మైదానం) ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
పాక్ మ్యాచ్‌లన్నీ అక్కడే..!
ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరుగుతాయి. ఒకవేళ పాక్ సెమీస్‌కు, ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్ జట్లను తమ దేశంలో అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
పాక్‌తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్‌లను సైతం రద్దు చేసుకుంది. ఇతర దేశాలు పాల్గొనే మెగా టోర్నీల్లో మాత్రం తటస్థ వేదికలపై పాక్‌తో ఆడుతుంది.
2026 ప్రపంచకప్ ఆడే దేశాలు ఇవే..!
టీ20 ప్రపంచకప్‌కు మొత్తం 20 దేశాలు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక.. గత ప్రపంచకప్‌లో (2024) సూపర్-8 దశకు చేరిన 7 జట్లు (ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్‌ఏ) ఈ మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి.
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. అమెరికా రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా కెనడా అర్హత సాధించింది.
యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా నెదర్లాండ్స్, ఇటలీ అర్హత సాధించాయి. అఫ్రికా క్వాలిఫయర్ ద్వారా నమీబియా, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. చివరిగా ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ద్వారా ఒమన్, నేపాల్, యూఏఈ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..?
ఈ టోర్నీలో తలో ఐదు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్ దశ అనంతరం సూపర్-8 పోటీలు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో తలో నాలుగు జట్లు రెండు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి.
సూపర్-8లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ విజేతలు ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీ షెడ్యూల్, గ్రూప్ తదితర వివరాలు మరికొద్ది రోజుల్లో వెలువడతాయి.


