ప్రపంచకప్‌ జట్టులో జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు! | Aakash Chopra picks alternate India squad for T20 WC 2026 Shami In | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ జట్టులో జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్‌!

Dec 25 2025 9:42 AM | Updated on Dec 25 2025 11:14 AM

Aakash Chopra picks alternate India squad for T20 WC 2026 Shami In

ఆకాశ్‌ చోప్రా ప్రత్యామ్నాయ జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో టీమిండియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2024లో కరేబియన్‌ దీవుల్లో ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు.. ఈసారి సొంతగడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. గతేడాది కాలంగా నిలకడైన ప్రదర్శనతో.. వరుస విజయాలతో సూర్య సేన మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా మారింది.

ఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేసింది. 

వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్‌ గిల్‌పై వేటు వేయడంతో పాటు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (Jitesh Sharma)ను కూడా జట్టు నుంచి తప్పించింది. వీరి స్థానాల్లో రింకూ సింగ్‌ (Rinku Singh), ఇషాన్‌ కిషన్‌లకు చోటిచ్చింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా.. బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ప్రత్యామ్నాయ జట్టుతో ముందుకు వచ్చాడు. మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నా.. చాన్నాళ్లుగా భారత టీ20 జట్టుకు దూరమైన ఆటగాళ్లతో ఆకాశ్‌ చోప్రా తన టీమ్‌ను ప్రకటించాడు. 

జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు
ఓపెనర్లుగా రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌లను ఎంచుకున్న ఈ మాజీ ఓపెనింగ్‌ బ్యాటర్‌... శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, జితేశ్‌ శర్మలకు కూడా స్థానం ఇచ్చాడు.

భువీ, షమీలకూ ఛాన్స్‌
అదే విధంగా.. పేసర్ల విభాగంలో స్వింగ్‌ సుల్తాన్‌, జట్టుకు ఏనాడో దూరమైన భువనేశ్వర్‌ కుమార్‌కు చోటిచ్చిన ఆకాశ్‌ చోప్రా.. ఇటీవలి కాలంలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నా సెలక్టర్లు పక్కనపెడుతున్న మొహమ్మద్‌ షమీని కూడా తన జట్టుకు ఎంపిక చేశాడు. వీరికి తోడుగా మొహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చహర్‌లకు కూడా స్థానం కల్పించాడు.

ఇక ఆల్‌రౌండర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కృనాల్‌ పాండ్యా, మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌లను కూడా ఆకాశ్‌ చోప్రా తన జట్టులో చేర్చుకున్నాడు. కాగా భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 ఫిబ్రవరి 7న మొదలై.. మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టు
అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా,  ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రింకూ సింగ్‌.

టీ20 ప్రపంచకప్‌-2026 ఎడిషన్‌కు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న జట్టు
రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మొహమ్మద్‌ షమీ, యజువేంద్ర చహల్‌, మొహమ్మద్‌ సిరాజ్.

చదవండి: టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్‌ సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement