రాణించిన హేమంత్, నితీశ్, రికీ భుయ్
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆంధ్ర జట్టు... రెండో పోరులో గెలుపుబాట పట్టింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో రైల్వేస్‌ను ఓడించింది. మొదట రైల్వేస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రవి సింగ్ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్ష్ యాదవ్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు.
ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, కలిదిండి రాజు చెరో 3 వికెట్లు పడగొట్టగా... హేమంత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్ (74 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (41 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.
మారంరెడ్డి హేమంత్ రెడ్డి (35 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షేక్ రషీద్ (53 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబ్బర్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు), శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా తలా కొన్ని పరుగులు చేశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన హేమంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సోమవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఒడిశా జట్టుతో ఆంధ్ర తలపడుతుంది.
మళ్లీ ఓడిన హైదరాబాద్
రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు.
లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో ధ్రువ్‌కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అమన్ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశ్ రాథోడ్ (68; 6 ఫోర్లు), సమర్థ్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... అభిరథ్ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.


