నేటి నుంచి నాగాలాండ్‌తో ఆంధ్ర చివరి మ్యాచ్
గెలిస్తే నేరుగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత
న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో చివరి దశ పోటీలకు రంగం సిద్ధమైంది. నాకౌట్ దశకు ముందు జరగనున్న చివరి గ్రూప్ మ్యాచ్‌లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రూప్ ‘ఎ’లో నాగాలాండ్ జట్టుతో ఆంధ్ర తలపడనుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న రికీ భుయ్ సారథ్యంలోని ఆంధ్ర జట్టు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా నాకౌట్ దశకు అర్హత సాధించనుంది.
నాగాలాండ్‌లోని సోవిమా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భపై చక్కటి విజయం సాధించిన ఆంధ్ర జట్టు ప్రస్తుతం 28 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. జార్ఖండ్, విదర్భ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
కెప్టెన్ రికీ భుయ్‌తో పాటు శ్రీకర్ భరత్, షేక్ రషీద్, టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, కరణ్ షిండేలతో ఆంధ్ర జట్టు బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. ఈ సీజన్‌లో ఏ ఒక్కరి ప్రతిభ మీదో ఆధారపడకుండా... ఆంధ్ర జట్టు సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లోనూ అదే మంత్రం జపించాలని చూస్తోంది.
బౌలింగ్‌లో విజయ్, సాయితేజ, సౌరభ్ కుమార్, కేఎస్‌ఎన్ రాజు, శశికాంత్ కీలకం కానున్నారు. మరోవైపు తాజా సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి... ఒక మ్యాచ్ ‘డ్రా’ చేసుకొని ఒకే పాయింట్‌తో పట్టిక అట్టడుగున ఉన్న నాగాలాండ్ జట్టు... ఆంధ్ర టీమ్‌కు ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.
ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ ‘ఢీ’
మరోవైపు గ్రూప్ ‘డి’లో పడుతూ లేస్తూ సాగుతున్న హైదరాబాద్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్ నాకౌట్‌కు దూరమైంది. రెగ్యులర్ కెప్టెన్ తిలక్ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
బ్యాటింగ్‌లో అభిరత్ రెడ్డి, అమన్ రావు, రాహుల్ సింగ్, హిమతేజ, రాహుల్ రాధేశ్, రోహిత్ రాయుడు, నితీశ్ రెడ్డి చామా మిలింద్ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్ సిరాజ్‌తో పాటు రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్ కీలకం కానున్నారు. ఇతర కీలక మ్యాచ్‌ల్లో ఒడిశాతో జార్ఖండ్... ఉత్తరప్రదేశ్‌తో విదర్భ... బరోడాతో తమిళనాడు... మధ్యప్రదేశ్‌తో మహారాష్ట్ర... పంజాబ్‌తో కర్ణాటక... ముంబైతో ఢిల్లీ తలపడనున్నాయి.


