రోజర్ బిన్నీకి కూడా గుర్తింపు
బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రకటన
ఉత్తమ క్రికెటర్లుగా గిల్, స్మృతి
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతీ ఏటా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లకు ఇచ్చే ‘నమన్’ అవార్డుల వివరాలను 2026 సంవత్సరానికిగాను ప్రకటించింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకుగాను అందించే కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఈ సారి ముగ్గురు క్రికెటర్లకు ప్రకటించారు. రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్‌లతో పాటు భారత మహిళల జట్టు మాజీ కెపె్టన్ మిథాలీ రాజ్ కూడా ఈ పురస్కారానికి ఎంపికైంది. పురుషుల విభాగంలో ఇచ్చే అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ ‘పాలీ ఉమ్రీగర్ అవార్డు’ భారత టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్‌మన్ గిల్‌కు దక్కింది. మహిళల విభాగంలో అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురస్కారం స్మృతి మంధాన గెలుచుకుంది. ఆమె కెరీర్‌లో ఈ అవార్డు సాధించడం ఐదో సారి కావడం విశేషం. నేడు (ఆదివారం) న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్య క్రమంలో ఈ అవార్డులను అందజేస్తారు.
యువ క్రీడాకారులకూ...
వర్ధమాన క్రికెటర్లకు ప్రోత్సాహకాన్ని అందించే ఇతర అవార్డులను కూడా బోర్డు ప్రకటించింది. దేశవాళీ మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్లేయర్లకు ఇచ్చే ‘జగ్మోహన్ దాల్మి యా’ అవార్డును ఇద్దరు ప్లేయర్ అందుకోనున్నారు. ముంబైకి చెందిన ఇరా జాదవ్, హరియాణా ప్లేయర్ షఫాలీ వర్మలకు ఈ అవార్డు దక్కింది. పురుషుల విభాగంలో దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ ‘లాలా అమర్‌నాథ్’ అవార్డు పరిమిత ఓవర్ల టోరీ్నల్లో ఆయుశ్ మాత్రేకు, రంజీ ట్రోఫీలో ప్రదర్శనకుగాను హర్‡్ష దూబేకు దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో సీజన్‌లో నాలుగు ట్రోఫీలు గెలుచుకోవడంతో పాటు రెండు టోరీ్నల్లో రన్నరప్‌గా నిలిచిన ముంబై జట్టుకు ఉత్తమ క్రికెట్ అసోసియేషన్ అవార్డు లభించింది.
ఐదు టీమ్‌లకు సత్కారం...
‘నమన్’ అవార్డుల వేడుకలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీసీఐ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జత చేసింది. ఇటీవల ఐదు వేర్వేరు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ (ఐసీసీ) ట్రోఫీలు గెలిచిన భారత జట్లను ఒకేసారి ప్రత్యేకంగా సన్మానించనుంది. పురుషుల విభాగంలో 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లు... మహిళల విభాగంలో 2025 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్... అండర్–19 స్థాయిలో పురుషుల వరల్డ్ కప్ 2026, మహిళల వరల్డ్ కప్ 2025 గెలిచిన టీమ్‌లను సత్కారం దక్కనుంది.
రోజర్ బిన్నీ: 1983 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసి భారత జట్టు చారిత్రాత్మక విజయంలో బిన్నీ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1985 వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచిన జట్టులో కూడా బిన్నీ సభ్యులు. ఆల్‌రౌండర్‌గా భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడిన బిన్నీ రెండు ఫార్మాట్‌లలో కలిపి 1459 పరుగులు చేసి 124 వికెట్లు పడగొట్టారు. 2000లో అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు కోచ్‌గా ఉన్న బిన్నీ ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సెలక్టర్‌గా, 2022–25 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
రాహుల్ ద్రవిడ్: బ్యాటింగ్‌లో అసాధారణ సాంకేతిక నైపుణ్యం, పదునైన డిఫెన్స్‌తో భారత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ద్రవిడ్ గుర్తింపు పొందాడు. 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు చేసిన ఘనత ద్రవిడ్ సొంతం. ద్రవిడ్ కోచ్‌గా ఉన్న భారత అండర్–19 జట్టు 2018లో వరల్డ్ కప్ గెలుచుకోగా ... అతని కోచింగ్‌లో 2024లో భారత సీనియర్ టీమ్ టి20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.


