రంజీ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ విదర్భపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం
షేక్ రషీద్ అజేయ సెంచరీ
సాక్షి, అనంతపురం: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో కీలక విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం ముగిసిన పోరులో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్టుపై ఘనవిజయం అందుకుంది. 259 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 93/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 56.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షేక్ రషీద్ (144 బంతుల్లో 132 నాటౌట్; 21 ఫోర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. కెపె్టన్ రికీ భుయ్ (92 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో వికెట్‌కు శ్రీకర్ భరత్ (89 బంతుల్లో 43; 5 ఫోర్లు)తో కలిసి 99 పరుగులు జోడించిన రషీద్... అబేధ్యమైన మూడో వికెట్‌కు రికీ భుయ్‌తో కలిసి 145 పరుగులు జతచేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన విదర్భ జట్టు... ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు నిలువలేకపోయింది. ఆ జట్టు బౌలర్లలో నచికేత్ రెండు వికెట్లు పడగొట్టాడు. 6 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర జట్టు 4 విజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసింది. 28 పాయింట్లతో ఆంధ్ర గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది.
జార్ఖండ్, విదర్భ జట్లు చెరో 25 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్ దశలో భాగంగా తమ చివరి మ్యాచ్‌లో గురువారం నుంచి నాగాలాండ్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.


