టీ20 వరల్డ్‌కప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుహ్యంగా గిల్ స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో కిషన్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు.
అయితే సడన్‌గా కిషన్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేరాడు. గిల్ స్ధానంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. కాగా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రిటైర్మెంట్ తర్వాత టీ20ల్లో జైశ్వాల్‌కు ఓపెనర్‌గా చోటు దక్కుతుందని అంతా భావించారు.
కానీ అతడిని పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్-అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. ఆ తర్వాత గిల్ తిరిగి జట్టులోకి రావడంతో శాంసన్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.
అయితే తన పునరాగమనంలో గిల్ విఫలం కావడంతో సెలక్టర్లు వేటు వేశారు.మళ్లీ అభిషేక్-సంజూనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే జైశ్వాల్‌కు కూడా ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌తో పాటు టెస్టు క్రికెట్‌లో కూడా ఓపెనర్‌గా తన మార్క్ చూపించాడు.
"టీ20 ప్రపంచకప్ టోర్నీకి సెలక్టర్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేశారు. కానీ ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ లేకపోవడం తీవ్ర నిరాశపరిచింది. అతడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం.
జైశూ టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే ఇంకా ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు. గిల్ ఫామ్‌లో లేనందున పక్కన పెట్టడం సరైన నిర్ణయమే.
ఈ విషయంలో నేను సెలక్షన్ కమిటీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను. కానీ గిల్ స్ధానంలో జైశ్వాల్‌కు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. అతడికి ఓపెనర్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మెరుపు ఆరంభాలను అందించే సత్తా అతడికి ఉంది అని వెంగ్‌సర్కార్ పిటిఐతో పేర్కొన్నాడు.
కాగా జైశ్వాల్ గత కొంత కాలంగా టెస్టు జట్టులో మాత్రం రెగ్యూలర్‌గా సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన దక్కిన అవకాశాన్ని జైశ్వాల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గిల్ గైర్హజరీలో జట్టులోకి వచ్చిన జైశూ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.
చదవండి: 'అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్ టోర్నీకి రెడీ'


