'అతడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీకి రెడీ' | Delhi coach shares good news after Vijay Hazare Trophy return | Sakshi
Sakshi News home page

'అతడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీకి రెడీ'

Dec 25 2025 3:24 PM | Updated on Dec 25 2025 3:52 PM

Delhi coach shares good news after Vijay Hazare Trophy return

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ప్ర‌స్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు.

బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవ‌లం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల‌తో 131 ప‌రుగులు చేశాడు. 

కోహ్లికి ఇది 58వ లిస్ట్‌-ఎ సెంచ‌రీ. అదేవిధంగా ఇదే మ్యాచ్‌లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగ‌మించాడు. ఇప్పటికే టీ20, టెస్టుల‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డే ఫార్మాట్ల‌లో మాత్రమే కొన‌సాగుతున్నాడు. 

అయిన‌ప్ప‌టికి త‌నలో ఏ మాత్రం జోరు త‌గ్గ‌లేద‌ని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2027కు తాను సిద్దంగా ఉన్నానని త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో కోహ్లి చిన్న‌నాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.  "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. 

చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి 302 పరుగులు చేశాడు.
చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌.. చెలరేగిన జీషన్‌ అన్సారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement