రింకూ సింగ్ (పాత ఫొటో)
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆడే భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్ దేశీ వన్డే టోర్నీలో శుభారంభం అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ నయా ఫినిషర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌ను విజయంతో ఆరంభించాడు.
ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 84 పరుగుల తేడాతో హైదరాబాద్ (HYD vs UP)పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఉత్తరప్రదేశ్. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు సాధించింది.
అదరగొట్టిన జురెల్, ఆర్యన్, రింకూ
ధ్రువ్ జురేల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రింకూ సింగ్ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు.
ఇక హైదరాబాద్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా... రక్షణ్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది.
ఫలితంగా 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (53; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా... రాహుల్ బుద్ధి (47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (45; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.
జీషాన్ అన్సారీకి 4 వికెట్లు
ఉత్తరప్రదేశ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూకశ్మీర్ 10 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై... బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై... బెంగాల్ 3 వికెట్ల తేడాతో విదర్భపై విజయాలు సాధించాయి.
ఇక ఎలైట్ గ్రూప్ ‘సి’లో హిమాచల్ ప్రదేశ్ 95 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై... గోవా 6 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై... పంజాబ్ 51 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి.
మరోవైపు.. గ్రూప్ ‘ఎ’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 145 పరుగుల తేడాతో త్రిపురపై... తమిళనాడు 101 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై... మధ్యప్రదేశ్ 99 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై విజయాలు సాధించాయి.
చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్!


