టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో సతమవుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికి..వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.
2025 ఏడాది అతడి కెరీర్‌లో ఒక పీడకలల మిగిలిపోనుంది. ఆసియాకప్ వంటి మేజర్ టైటిల్స్ సాధించినప్పటికి.. ఒక ఆటగాడిగా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ ఏడాది కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. ఈ ఏడాది మొత్తంగా 21 అంతర్జాతీయ టీ20లు ఆడిన సూర్యకుమార్.. 13.62 సగటుతో కేవలం 218 పరుగులు చేశాడు.
అత్యధిక స్కోర్ 47గా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా కేవలం 34 పరుగులు (12, 5, 12, 5) మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్-2026 తర్వాత సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందే సూర్యపై వేటు వేయాలని సెలక్టర్లు భావించినప్పటికి.. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు ప్రయోగాలు ఎందకని తమ నిర్ణయాన్ని మార్చుకున్నారంట.
కెప్టెన్‌గా బుమ్రా..!
అయితే భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తదుపరి కెప్టెన్‌గా బుమ్రా పేరును సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రాకు కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేనప్పటికి.. నాయకత్వ లక్షణాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.
రోహిత్ శర్మ తరహాలోనే బుమ్రా మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడి సమయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక బౌలర్‌గా అతడికి బాగా తెలుసు. 2022లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టుకు బుమ్రా నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.
టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు బుమ్రా నెలకొల్పాడు. ఆ తర్వాత 2023లో ఐర్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బుమ్రా.. ఆ సిరీస్‌లో కెప్టెన్‌గా, బౌలర్‌గా దుమ్ములేపాడు.
అయితే రోహిత్ శర్మ రిటైర్మ్ తర్వాత బుమ్రా టెస్టు కెప్టెన్‌గా ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడే కీలక బౌలర్ కావడంతో.. అతడికి కొన్ని సిరీస్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు కేవలం మూడు టెస్టులు ఆడాడు.
మిగితా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అందుకే అతడికి టెస్టుల్లో జట్టు పగ్గాలను అప్పగించలేదు. కానీ అతడు ఇప్పుడు దాదాపుగా అన్ని టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటున్నాడు. వన్డే, టెస్టులకు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికి పొట్టి ఫార్మాట్‌లో మాత్రం ఆడేందుకు బుమ్రా సముఖత చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.
చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్..


