హెడ్‌కోచ్ గంభీర్‌తో గిల్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న ఈ ముంబైకర్.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అతడిలోని ఆటగాడు కనుమరుగైపోయాడు.
పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా ఆపసోపాలు పడుతూ.. వరుస వైఫల్యాలతో సూర్యకుమార్ (Suryakumar Yadav) సతమతమవుతున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ తన వైఫల్యాన్ని కొనసాగించిన సూర్య.. తనలోని బ్యాటర్ తప్పిపోయాడంటూ స్వయంగా అంగీకరించాడు.
గిల్‌పై వేటు
ఈ నేపథ్యంలో ప్రపంచకప్-2026 టోర్నీలోనూ ఇదే తరహాలో విఫలమైతే సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. వరల్డ్‌కప్ టోర్నీ నుంచి వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో రీఎంట్రీ ఇచ్చిన గిల్ కోసం సంజూ శాంసన్ (Sanju Samson)ను పక్కనపెట్టి.. వరుస అవకాశాలు ఇచ్చింది మేనేజ్‌మెంట్. అయితే, అతడు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వైస్ కెప్టెన్ గిల్, మూడు లేదా నాలుగో స్థానంలో వస్తూ కెప్టెన్ సూర్య విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో యాజమాన్యానికి గిల్‌పై వేటు వేయక తప్పలేదు.

ఇద్దరూ ఇద్దరే.. భరించలేరు
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్‌మెంట్ ఇద్దరు ఫామ్‌లేమి బ్యాటర్లను భరించలేదని.. అందుకే గిల్‌పై వేటు వేసిందని అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీలో ఫామ్‌లో లేని ఒక్క ఆటగాడిని మాత్రమే యాజమాన్యం భరించగలదు.
సూర్యకుమార్ కెప్టెన్‌గా విజయాలు సాధిస్తున్నాడు. అయితే, పరుగులు రాబట్టడంలో తడబడుతున్నాడు. అయినప్పటికీ సారథిగా జట్టులో తన స్థానం పదిలంగానే ఉంటుంది. అందుకే సూర్యను కాపాడుకుని గిల్‌ను మాత్రం తప్పించారని అనిపిస్తుంది.
గిల్‌పై వేటు సరైన నిర్ణయమే
అయితే, శుబ్‌మన్ గిల్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కాల్సిందని నేను చెప్పడం లేదు. అతడి నిలకడలేని ఫామ్ వల్లే ఇలా జరిగింది. బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారి అతడి కళ్లలో ఏదో కన్ఫ్యూజన్. ఏదేమైనా ఈసారి ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టు పటిష్టంగా ఉంది’’ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు. కాగా సూర్య, గిల్ తన పది ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్క అర్ధ శతకం కూడా బాదకపోవడం వారి ఫామ్‌లేమికి నిదర్శనం.
చదవండి: IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరం


