టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తొడ కండరాల (హ్యామ్‌స్ట్రింగ్ ) గాయం బారిన పడ్డాడు. బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 సీజన్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా డేవిడ్(హోబర్ట్ హరికేన్స్) తొడ కండరాలు పట్టేశాయి.
151 పరుగుల లక్ష్య చేధనలో హోబర్ట్ హరికేన్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 41 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న సమయంలో అతడు అనుహ్యంగా గాయపడ్డాడు.
సింగిల్ తీసే క్రమంలో అతడి కుడి తొడ వెనుక కండరాలు పట్టేశాయి. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, నొప్పితోనే డేవిడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి పరిస్థితిని చూస్తుంటే గాయం తీవ్రమైనది అనిపిస్తోంది. స్కాన్ రిపోర్ట్‌ల తర్వాత అతడి గాయం తీవ్రత తేలనుంది. ఏదేమైనప్పటికి డేవిడ్ వంటి కీలక ఆటగాడు ప్రపంచకప్‌నకు ముందు గాయపడటం ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.
ఒకవేళ అతడి గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉంటే కోలుకోవడానికి సుమారు మూడు వారాల సమయం పడుతోంది. అదే గ్రేడ్-2 అయితే రెండు నుంచి మూడు నెలలు.. గ్రేడ్ 3 అయితే 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.
డేవిడ్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు


